సెంటిమెంట్ దే హవా (`జై సింహా` రివ్యూ )
ఉండమ్మా బొట్టు పెడితా,పుట్టింటికి రా చెల్లీ, గోరింటాకు, మమతల కోవెల, మాతృదేవోభవ వంటి సెంటిమెంట్ సినిమాలు తెలుగు తెరపై బాగా తగ్గిపోయాయి. బాగ్యరాజాలు, ముత్యాల సుబ్బయ్యలు రిటైర్ అయ్యిపోయారు. సెంటిమెంట్ తరం టీవిల ముందు సెటిలైపోయింది. దాంతో ఆ తరహా సినిమాలు టీవీ కు ట్రాన్సఫరైపోయి... సీరియల్స్ రూపంలో అలరిస్తున్నాయి. దాంతో తెలుగు తెరపై సెంటిమెంట్ డ్రామాలు తెరపడిపోయింది.
అడపా దడపా అప్పుడప్పుడూ పెద్ద హీరోల సినిమాల క్లైమాక్స్ లు ప్లాష్ బ్యాక్ ల్లో నే సెంటిమెంట్ సీన్స్ మెరుస్తున్నాయి. అవి కూడా... మెలోడ్రామా గా మారకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ, రెండు,మూడు సీన్స్ కు పరిమితం చేస్తున్నారు. అంతే తప్ప కథలోనే సెంటిమెంట్ యాంగిల్ కు పెద్ద పీట వేసి, దాని చుట్టూనే కథలు నడపే ధైర్యం చేయటం లేదు. జనాలను ఏడ్పిస్తే ...కలెక్షన్స్ ఇవ్వక ఆ తర్వాత మనల్ని వాళ్లు ఏడిపిస్తారు అని ఇండస్ట్రీ నమ్మటం మొదలెట్టింది.
అయితే మెల్లిమెల్లిగా మరుగనపడిపోతున్న సెంటిమెంట్ సీన్స్ పండించటం అనే కళను మళ్లీ బ్రతికించాలనుకున్నారు`జై సింహా` దర్శక,రచయితలు. ఆ కన్నీరు..కర్చీఫ్ రోజులను మళ్లీ తీసుకురావటానికి తమవంతుగా... సాధ్యమైనంత సెంటిమెంట్ డోస్ ని దట్టించి `జై సింహా` కథని వండి వడ్డించి,మన చేత వహ్వా అనిపించుకోవాలనుకున్నారు.
ఈ సినిమా చూసినవారి హృదయాన్ని తాకేలా ఆ సీన్స్ డిజైన్ చేయగలిగారా... అసలు ఈ సినిమా కథేంటి...బాలయ్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా...తమిళ డైరక్టర్ ...అరవ అతి లేకుండా ఈ సినిమాని అందించగలిగారా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
నరసింహ...ఓ అజ్ఞాతవాసి (కథ)
నరసింహా (బాలయ్య) బ్రతుకు తెరువు నిమిత్తం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. సంవత్సరం వయస్సున్న తన బిడ్డతో పాటు వచ్చిన నరసింహ కు అక్కడ దేవాలయం ధర్మకర్త (మురళీమోహన్) ఇంట్లో కారు డ్రైవర్ పని దొరుకుతుంది. సైలెంట్ గా డ్రైవర్ గా తన పని తాను చేసుకుంటున్న నరసింహ ని పరిస్దితులు వైలెంట్ గా మార్చటానికి ప్రయత్నిస్తూంటాయి. ఎంతగా ఆవేశాన్ని అణుచుకున్నా....సిట్యువేషన్స్ అతనిలోని అసలు సింహాన్ని నిద్రలేపుతూంటాయి.
ఆ క్రమంలో కుంభకోణంలో ఆవేశాన్ని ఆపుకోలేని పరిస్దితుల్లో ఓ అన్యాయాన్ని ఎదిరించటంతో అతను హైలెట్ అవుతాడు.మీడియాకు ఎక్కుతాడు. దాంతో జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న ఖైదీ (అసుతోష్ రాణా) కనెక్టు అవుతాడు. అక్కడ నుంచి కథ మలుపుతిరుగుతుంది. ఇంతకీ నరసింహంలో ఉన్న అసలు సింహం ఎవరు...అతనిది ఏ ఊరు..ఎందుకలా కుంభకోణం వెళ్లి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు...ఈ కథలో ట్రైలర్ లో చూపించిన నయనతార, నటాషా దోషి, హరిప్రియ కథలేంటి..ఇంతకీ బాలయ్య చేతిలో ఉన్న ఆ పిల్లాడు ఎవరు..ఆ ప్లాష్ బ్యాక్ ఏమిటి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
జై బాషా
రజనీకాంత్ భాషా సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పెద్ద హీరోల సినిమాలకు..ఫస్టాఫ్ లో కథని దాచి పెట్టి,సెకండాఫ్ లో దాన్ని రివీల్ చేసే కథలు చేయటం మొదలైంది. ఇప్పటికే దాదాపు అందరు పెద్ద హీరోలు ఈ టైప్ కథలు చేసారు. ఫస్టాఫ్ లో సాదాసీదాగా తిరిగే ఓ మామూలు వ్యక్తి..ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఓ గొప్ప వ్యక్తి అని రివీల్ అవటం జరుగుతూంటుంది. దాంతో అంత గొప్ప మహానుభావుడు..ఇలా సాదాసీదాగా ఫస్టాఫ్ లలో ఎందుకు బ్రతికాడు అనే క్వచ్చిన్ మార్క్ కు ఆన్సర్ దొరకటం..క్లైమాక్స్ ఉంటూంటుంది. అదే ఫార్ములాతోనే ఈ కథని నడిపారు. దాంతో సినిమాపై ఇంట్రస్ట్ అయితే పెరిగింది..కానీ బాగా రొట్టకొట్టుడు పాత కథ చూసిన ఫీలింగ్ వచ్చింది.
అరవ అతి
తెలుగు రచయిత అందించిన కథ, తెలుగు హీరో చేసిన సినిమా అయినా తమిళ దర్శకుడు డైరక్ట్ చేయటంతో ..అరవ అతి..అంతులేకుండా ప్రవహించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బాలయ్య లవ్ స్టోరీ, నయనతారతో సెంటిమెంట్ సీన్స్ ..చూస్తుంటే..ఇంత అతిగా ఉందేంటి అనిపించక మానదు.
బాలయ్యా ఏందయ్యా ఇది..
బాలకృష్ణ ఇంకా ..కాలేజికి వెళ్లే కుర్రాడిలా నయనతార తో ప్రేమ నడుపుతూ...ఆమె తండ్రికి చెప్పటానికి భయపడుతూండే సీన్స్ చూస్తూంటే ఆ ..పాత ...రోజుల్లో హీరోలు ఎంత వయస్సు వచ్చినా కాలేజీకు వెళ్లటం..పదో తరగతి పాస్ కావటం గుర్తుకు రావటం ఖాయం..ఎప్పటి సినిమా చూస్తున్నామా అని ..డౌట్ వస్తుంది. బాలయ్య వయస్సుకు తగినట్లు కాస్తంత హుందాగా ఉండే పాత్రలు ఎంచుకోక...కుర్ర క్యారక్టర్స్ వేయటం ఏంటో అర్దం కాదు.. హీరోలకు వయస్సేంటి అంటే చెప్పలేం.
వడివేలు కామెడీ..బ్రహ్మీ చేత
రజనీకాంత్ చిత్రం చంద్రముఖిలో వడివేలు కామెడీ గుర్తుందా..అందులో తన భార్యకు రజనీకాంత్ లైన్ వేస్తున్నాడని వడివేలు తెగ అనుమానిస్తూ బాధపడుతూంటాడు. అతని భార్య కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అదే ట్రాక్ ని ఈ సినిమాలో యాజటీజ్ దింపేసారు.అయితే ఈ సారి వడివేలు ప్లేస్ లో బ్రహ్మీ కనిపిస్తాడు.తన భార్యకు బాలకృష్ణ లైన్ వేస్తున్నాడేమో అని డౌట్. చంద్రముఖి నాటికి ఆ వడివేలు కామెడీ ఓకే కానీ..ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి కామెడీ..అదీ ఆల్రెడీ వచ్చింది ఎందుకు రిపీట్ చేసారో దర్శక,రచయితలకే తెలియాలి..కామెడీ అసలు పండలేదు.
బాలయ్య ఎలా చేసాడు
ఇక ఈ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించాడు..దుమ్ము రేపాడు అని చెప్పలేం కానీ...ఆయన నటనానుభవం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ చంటిబిడ్డకి తల్లీతండ్రీ తానే అయిన లాలించే పాత్రలోనూ, నయనతారకి ప్రేమికుడిగా, ఒక గ్యారేజ్ ఓనర్ గా, పదిమందికి మంచి చేసే మనిషిగా, అన్యాయం ఎదురైతే ఎంతటివారినైనా తాట తీసే సమరసింహంగా, శత్రువుల్ని తుదముట్టించే నరసింహుడిగా... ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని అవలీలగా పోషించి మెప్పించేశాడు బాలకృష్ణ. ఈ సినిమాలో హైలెట్ ఏదైనా ఉందీ అంటే, అది బాలయ్య పెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. డాన్స్ లు కూడా వయస్సుని ప్రక్కన పెట్టి...మరీ చేసేసాడు.
డైరక్టర్ @ 1980
కమల్,రజనీ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన కెఎస్ రవికుమార్ ఈ మధ్యకాలంలో కాస్త వెనకబడ్డారు. బాలయ్యను అడ్డం పెట్టుకుని హిట్ కొట్టి,మళ్లీ స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆయన మేకింగ్, కథలు ఎంపిక..ఇరవై ఏళ్ల క్రితం సినిమాల వాతావరణాన్ని తలపించింది. కథ ఎనభైల్లో జరుగుతోంది అని ఒక ముక్క మొదట్లో వేసి.. జై సింహా... 1980 అని వేసి ఉంటే అద్బుతంగా..అప్పటి కాలం నాటి కథని..అప్పటి కాలంనాటి డైరక్షన్ లాగ ఎంత బాగా తీసారు అని అంతా మెచ్చుకుందురు.
టెక్నికల్ గా
ఇక టెక్నికల్ గా ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే..ముందుగా రచయిత ఏ ఎం రత్నం డైలాగులు గురించి చెప్పుకోవాలి. ఆయన అందించిన కథ బాగా పాతదే కానీ డైలాగులు మాత్రం బాగున్నాయి. చిరంతన్ భట్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ జస్ట్ ఓకే అన్నట్లు గానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగున్నా...దర్శకుడు మేకింగ్ తగినట్లుగా బాగా పాతగా ఉంది. ఎడిటింగ్ లో సెకండాఫ్ లో కొన్ని సీన్స్ లేపేయచ్చు నిర్మాణ విలువలు బాగున్నాయి.
హైలెట్స్..
ఫస్టాఫ్ లో వచ్చే కుంభకోణం లో వచ్చే బ్రహ్మాణుల ప్రాముఖ్యతను,గొప్పతన్నాని వివరించే ఎపిసోడ్ చాలా బాగా డిజైన్ చేసారు. అందులో కట్ లేకుండా కంటిన్యూగా బాలయ్య చెప్పే డైలాగ్...సూపర్బ్ అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ బాగున్నాయి. సెకండాఫ్ లో అటువంటి పెద్దగా చెప్పుకునే ఎలిమెంట్స్ ఏమీ లేవు.
ఫైనల్ ధాట్
సెంటిమెంట్ సీన్స్ హైలెట్ గా ఉంటూ వచ్చిన ఈ చిత్రం...ఫ్యామిలీలకు పడితే హిట్టే...కుర్రాళ్లకు కష్టమే.