అంతులేని ప్రేమ వెర్సస్ 'అతి' శుభ్రత ('మహానుభావుడు' రివ్యూ )
ఏదన్నా ఓ అనారోగ్య సమస్యను ( ఫిజకల్ గానీ, మెంటల్ గాని) సినిమా కథగా మార్చుకుని హిట్ కొట్టడం అంత ఈజీకాదు. ముఖ్యంగా ఎదుటివాడి బాధను ఫన్నీగా చూపాలంటే చాలా గట్స్ కావాలి. ఎందుకంటే ఏ మాత్రం బాలెన్స్ తప్పినా ఆ పాత్ర మీద జాలి వస్తుంది తప్ప కామెడీ రాదు. దాంతో అలాంటి సినిమాలు మన దేశంలో..ముఖ్యంగా తెలుగులో బాగా తక్కువ. హాలీవుడ్ చూపే తెగువ మనం చూపలేం. అయితే దర్శకుడు మారుతి మాత్రం ధైర్వవంతుడే. మతిమరుపుని బేస్ చేసుకుని భలే భలే మొగాడివోయ్ తీసి, సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనే డిజార్డర్ పై సినిమా చేసారు. నవ్విస్తానంటూ ట్రైలర్స్, టీజర్స్ తో హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకున్నాడా... ఓసిడి డిజార్డర్ ని అర్దమయ్యేలా చెప్పగలిగాడా..అసలు కథేంటి... ఆ మధ్యన ఏదో మళయాళి చిత్రం కథ కాపీ కొట్టాడు అన్నారు.అందులో నిజమెంత... వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి
అతి శుభ్రత అనే ఓ మానసిక రోగంతో వచ్చే ఇబ్బందిని ఎదుర్కొంటూ హీరో, తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే సినిమా కథాంశం.
శుభ్రత..పరిశుభ్రత అంటూ చెలగరేగిపోతూ అతి శుభ్రతని ఇంప్లిమెంట్ చేస్తూంటాడు ఆనంద్ (శర్వానంద్). అది ఛాధస్తం కాదు ఓ డిజార్డర్. ఈ డిజార్డర్ పేరు ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) . స్వఛ్చ్ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ లా తయారైన ఆనంద్ ...ఎక్కడ కాస్తంత మురికి ఉన్నా తట్టుకోలేడు. ప్రధానిగారు దేశం మొత్తం శుభ్రత పని తనకే అప్పచెప్పినట్లుగా...తనే రంగంలోకి దిగి ఎక్కడైనా కాస్తంత బురద ఉందంటే దాన్ని అన్ని పనులు మానుకుని మరీ శుభ్రం చేసేస్తూంటాడు. అక్కడితో ఆగితే ఫర్వలేదు.. ఎవరికన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా పది సార్లు ఆలోచిస్తూ...ఇంటా,బయిటా అతి శుభ్రత తో అందరినీ చావగొడుతూ,అయోమయంలో పడేస్తూంటాడు . ఈ సమస్య ఏ స్దాయికి చేరుకుంటుంది అంటే... తల్లికి జ్వరం వచ్చినా కూడా దగ్గరకి రానివ్వడు. ఆ వైరస్ తనకు అంటుకుంటూందేమో అని.
చివరకు మందు బిళ్లలు సైతం నీళ్లలో కడిగి వేసకునేంత అతి జాగ్రత్త పాటించే ఆనంద్ కి మేఘన (మెహరీన్) పరిచయం అవుతుంది. ఓసీడి ఉన్నంత మాత్రాన ప్రేమలో పడాలని రూల్ లేదు కాబట్టిఆమెతో తగిన శుభ్రతకు చెందిన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేమాయణం పోగ్రాం పెడతాడు. ఆమెకీ ఉన్నంతలో కాస్తంత శుభ్రత గా ఉండటం ఇష్టమే. ఆ లక్షణమే ఇద్దరినీ కలుపుతుంది. కొద్ది రోజులకు ఆమెకు తన ప్రపోజ్ చేస్తాడు... ఆమె కూడా సరే అంటుంది. కానీ... మా నాన్న(నాజర్) కు నచ్చాలి.. అనే కండీషన్ పెడుతుంది. ఆ నచ్చే ప్రాసెస్ లో ఆమె స్వగ్రామం పట్టిసీమ వెళ్లాల్సి వస్తుంది. ఆ పల్లెటూరులో ఉన్న జనం అంతా ఎడ్డి గా కనిపిస్తారు.
వాళ్ల ప్రేమానుబంధాలు సైతం పరిశుభ్రంగా ఉండవనిపిస్తుంది. అయితే తనకు మేఘన కావాలి అంటే వాళ్లందరినీ భరించాలి. సర్లై పంటి బిగువున భరిస్తూంటే... అక్కడ తనకీ తనలోని ఓసీడికు ఓ పరీక్ష ఎదురౌతుంది. అప్పుడు ఏమైంది...ఫైనల్ గా మేఘన నాన్న (నాజర్)కు ఆనంద్ నచ్చాడా? లేదా?? తన ప్రేమని గెలిపించుకోవడానికి ఆనంద్ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఆ పల్లెలో ఓసీడీ వల్ల ఎదురైన సమస్యలేంటి? ఈ విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నువ్వు వస్తానంటే నే వద్దంటానా
ఇలాంటి క్యారక్టర్ డ్రైవన్ కథలు మన తెలుగులో అరుదనే చెప్పాలి. రొటీన్ సెటప్ లోకి కొత్త తరహా క్యారక్టరైజేషన్ ప్రవేశపెట్టి దర్శకుడు మారుతి చెడుగుడు ఆడేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో పల్లెటూరుకి హీరో వెళ్లాక..అక్కడ అతనికి తన అతి శుభ్రతను సవాల్ చేసే సిట్యువేషన్స్ ఎదురయ్యినప్పుడు వచ్చే కామెడీని బాగా పండించారు. ఆ ఎపిసోడ్ తీసేస్తే సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. కానీ ఆ ఎపిసోడే సినిమాని నిలబెట్టేసింది.
కొత్త క్యారక్టరైజేషన్ + రొటీన్ కథ
అయితే ఈ సినిమాలో హీరోకు ఓసీడి సమస్య ఉంటే ఈ చిత్రం కథకు ప్రెడిక్టుబులిటీ అనే సమస్య వచ్చింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ అంటే.. ఏ సీన్ లో ఎలా ఉంటుందో ముందే సగటు సినిమా ప్రేక్షకుడు ఊహించేలా ఉంటుంది. హీరో క్యారక్టరైజేషన్ లో కొత్తదనం తప్ప, స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ లు ఏమీ లేకపోవటంతో ఫస్టాఫ్ ,ఇంటర్వెల్ , దాని తర్వాత సెకండాఫ్ ఎలా నడుస్తుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ కథ మలుపు తిరుగుతుంది అనే అంశాలన్నీ ప్రేక్షకుడు ముందుగా అనుకున్నట్టే ఉంటాయి. దానికి తోడు రొటీన్ అనిపించే క్లైమాక్స్. అయితే ఆ క్లైమాక్స్ రొటీన్ అని మనం రొటీన్ గా అనేసినా... అదే ఈ కథకు కరెక్ట్ జస్టిఫికేషన్ అనిపిస్తుంది. అలాగే క్యారక్టరైజేషన్ కొత్త, కథనం కొత్త అయితే కాస్త కన్ఫూజ్ అయ్యేదేమో.. ఇలాంటి పరిస్దితుల్లో రొటీన్ స్క్రీన్ ప్లే నే బెస్ట్ అనిపిస్తుంది. అయితే నవ్వుకోవటానికి సినిమాకువెల్లినవాళ్లకు స్క్రీన్ ప్లేతో పనేముంటుంది.
ఎందరో మహానుభావులు...
హీరో శర్వానంద్..రన్ రాజా రన్ నుంచి కాస్తంత ఉషారుగా ఉండే పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలోనూ ఆ జోష్ తెరపై కనిపిస్తుంది. హీరోయిన్..బొద్దుగా..ఉన్నా శర్వాకు సరైన జోడి అనిపించింది. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. జబర్దస్త్ వేణు కనిపించేది కొన్ని సీన్స్ లో అయినా గుర్తుండిపోయేలా చేసాడు . నాజర్ తో సహా అందరూ తమ పాత్రలకు తగ్గ ప్రదర్శనే చేశారు.
ఇక తమన్ సంగీతంతో ఆ మ్యాజిక్ పోయింది. టైటిల్ సాంగ్ ఒకటే బాగుంది. కాకపోతే ఆలోటుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తీర్చాడు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు. నజర్ షఫీ సినిమాటోగ్రఫీ కళ్లకు ఇంపుగా ఉంది. సినిమా మొత్తం కలఫ్ ఫుల్ గా, క్లిస్టర్ క్లియర్ గా ప్రతీ ఫ్రేమ్ ఉంది. ఇక దర్శకుడు మారుతి తన బూతు ట్రాక్ ని పూర్తిగా వదిలేసి, ఫ్యామిలీలకు నచ్చేలా తీసి భలే భలే డైరక్టవోయ్...నువ్వూ మహానుభావుడివే అనిపించుకున్నాడు. గుర్తుంచుకోదగ్గ డైలాగులు లేవు కానీ..సిట్యువేషన్ కు తగ్గట్లు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. అలాగే యువీ క్రియేషన్స్ వారు ఎప్పటిలా చిన్న సినిమాకు పెద్ద స్దాయిలో నిర్మాణ విలువలు పాటించారు.
ఫైనల్ థాట్
తన నెక్ట్స్ సినిమాకు మారుతి కథ చెప్పటానికి హీరో దగ్గరకి వెళితే..... నాదేం క్యారక్టర్ అని అడగకుండా...నేను ఏ రోగం (కంప్లైంట్ ) బాధ పడుతూంటాను అని అగుడుతారు :p
ఏమి బాగుంది: కొత్త క్యారక్టరైజేషన్ తో కొత్త సీన్స్ ,కొత్త కామెడీ
ఏం బాగోలేదు: కామెడీ కోసం రోడ్డు ప్రక్కన టాయిలెట్ కు కూర్చునే సీన్స్, చెరువులో కడుక్కునే సీన్స్ పెట్టడం
ఎప్పుడు విసుగెత్తింది : ఇలాంటి డిఫరెంట్ పాయింట్ ఉన్న సినిమా క్లైమాక్స్ కూడా అర్దం పర్దం లేని ఓ ఛాలెంజ్...కన్వీన్స్ కానీ ఫైట్ పెట్టడంతో...
చూడచ్చా ?: ఫ్యామిలీలతో సహా వెళ్లి చూడవచ్చు. వీకెండ్ కు మంచి కాలక్షేపం