ఫస్టాఫ్ రాజు...సెకండాఫ్ మంత్రి ( 'నేనే రాజు... నేనే మంత్రి' రివ్యూ)
‘అన్ని పాములు విషప్పురుగులు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.’ -చాణుక్యుడు
చంద్రబాబు ఈ కాలపు చాణుక్యుడా?,జగన్ ఈ సారైనా గెలుస్తాడా?...మోడీ విధానాలు మనకు పనికొచ్చేవేనా?... కేసీఆర్ పాలన ప్రశంసించే స్దాయిలో ఉందా?... వెంకయ్య నాయుడు ని ఉపరాష్ట్రపతి చేయటం వెనక ఏదన్నా వ్యూహం ఉందా?, పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి అవగలరా?మనం మెచ్చుకునే రాజకీయ నాయుకుడు నిజంగానే మహానుభావుడా...అతనికి మళ్లీ ఓటేయచ్చా... ?ఇలా ఎన్నో టాపిక్ లు..మనం రాజకీయాల్లో లేకున్నా...ఓటు హక్కు రాని రోజుల నుంచి మనం రోజూ మాట్లాడుకుంటూంటాం...ఈ విషయమై ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడతాం..వీటికి సమాధానాలు మనకు తెలియకుండానే అన్వేషిస్తూ ఉదయాన్నే టీవిల్లో పొలిటకల్ చర్చలు చూస్తూంటాం..పేపర్లలో ఎడిటోరియల్ కాలమ్స్ సీరియస్ గా చదివేస్తూంటాం. ఫైనల్ గా మనదైన శైలి వాదనను రెడీ చేసుకుంటాం. ఎవరైనా దొరికితే మన వాదనతో వాయితీసేస్తూంటాం... అప్పటికీ మనకి ఎక్కడో ఓ డౌట్...
కులాలు, కుట్రలు,కుతంత్రాలు లేకుండా ఎవరైనా రాజకీయం నడపగలరా...అధికారం అందుకోవటం కోసం హత్యారాజకీయాలు తెగ పడాల్సిందేనా ..వైకుంఠపాళి ఆట గుర్తు చేసుకోవాల్సిందేనా...ప్రస్తుతం ఉన్నరాజకీయాల్లో ఎవరు పవిత్రంగా ఉన్నారు..ఎందరు మహానుభావులు ఉంటారు. పైకి మహానుభావుల్లా కనిపించే వాళ్లంతా నిజంగా ఆ స్దాయి మనుష్యులేనా...ఇలా మన నిజ మనస్సు పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు ఓటేసి తర్వాత పొలిటీషన్స్ ని నిలదీయటానికి కూడా ధైర్యం చేయమని మనమందంరం..మళ్లీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఈ విషయాలే మన ఆఫీసుల్లో, వీధుల్లో, ప్రయణాల్లో గంటలకొలిదీ చర్చిస్తాం.
మరి మనకు వచ్చే ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు ఇస్తారు.. సమాధానాలతో ఓ సినిమా వస్తే చూస్తారా....అంటే 'నేనే రాజు... నేనే మంత్రి' ...యస్ చూస్తారు అని ధీమాగా సమాధానమిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో దర్శకుడు ఏం చెప్పదలిచాడు.. ఇప్పటి మన రాజకీయనాయకులను ఎవరైనా గుర్తు చేస్తూ హీరో పాత్ర డిజైన్ చేసాడా..అసలు కథేంటి..ఎలా ఉంది.. వంటి విషయాలు రివ్యూలో చదవండి.
కథేంటి
ఓ పల్లెటూళ్లో వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్ర (రానా)కి తన బార్య రాధ (కాజల్) అంటే ప్రాణం. ఆమె సంతోషమే లోకంగా బ్రతుకుతూంటాడు. పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆనందం వారి జీవితంలో ఎంతో సేపు నిలబడదు. వాళ్ల ఊరి గుడి దగ్గర తన కంటే ముందే వచ్చి దీపం వెలిగించిందనే కోపంతో గ్రామ సర్పంచి (ప్రదీప్‌రావత్) భార్య రాధని కిందకి తోసేస్తుంది. దాంతో ఆమె గర్భం పోవడంతో పాటు, చావుకి దగ్గరగా వెళుతుంది. (ఇంకా ఇలాంటి సంఘటనలు, ఇలా బిహేవ్ చేసే సర్పంచ్ భార్యలు ఉన్నారా..అని అడగొద్దు) . దాంతో తన బిడ్డ చనిపోయిందనే బాధలో ఎలాగైనా రాధకోసం ఊరికి సర్పించి కావాలనుకొంటాడు.
తన తెలివితేటలతో సర్పించ్ ని ఆకట్టుకుని ఆ పదివికి నామినేషన్ వేసి, జనాల సానుభూతితో ఎన్నికల్లో గెలుస్తాడు జోగేంద్ర. ఆ తర్వాత తనని ఆ సర్పంచ్ ని చంపేస్తాడు. ఆ కేసు నుంచి బయిటపడటం కోసం తన భార్యను లంచంగా అడిగాడని ఆ ఊరి ఎమ్మల్యే ని చంపేస్తాడు. ఆ తర్వాత రాజకీయ చదరంగం ఆడటం మొదలెడతాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ముఖ్యమంత్రి కుర్చీ దాకా వెళ్తాడు. అయితే ఊహించని విధంగా అతని చేసిన ఓ నేరంతో అతనికి ఉరి శిక్ష పడుతుంది. ఇంతకీ జోగేంద్ర ఉరిశిక్ష పడేటంత ఏం నేరం చేసాడు ... ఎత్తులకు పై ఎత్తులు వేసే జోగేంద్ర ఆ ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలిగాడా...అలాగే ముఖ్యమంత్రి పదివి అందుకోవటం కోసం అతను వేసిన ఎత్తులు ఏమిటి...రాజకీయాల్లోకి వచ్చాక జోగేంద్ర ఏమన్నా మారాడా...కేథరిన్ పాత్ర ఏమిటి...అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ ఓకే, కథనం అదే స్క్రీన్ ప్లే మాటేంటి?
ప్రేమించే భార్య తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో తన భార్య కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు. అలా స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా వారందరి కన్నా ఎత్తుకు ఎదదిగే ప్రయత్నంలో తనకు తెలియకుండానే తనను తానే మర్చిపోయి, పూర్తిగా మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూ ముందుకెళుతుంటాడు. ఆ తప్పులే పెరిగి పెద్దవై అతన్ని రాజకీయ వైకుంఠ పాళిలో మింగేస్తాయి. ఇదీ క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఓ సాధారణ వ్యక్తి...అసాధారణ స్దాయికి ఎదగాలంటే...తప్పులు చేయటంలోతప్పు లేదు అని ఈ సినిమా చెప్పదు కానీ అదే చూపిస్తుంది. ఫైనల్ గా చుట్టూ ఎంతమంది జనం ఉన్నా నా అన్నవారు తోడు లేకపోతే ఒంటిరే అనే నిజం ..చాలా పచ్చిగా చెప్తుంది...ఆ విషయంలో తేజ నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యారు.
ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..సినిమా మొత్తం ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెప్పారు. అదీ రానా పాయింటాఫ్ వ్యూలో. అలా కాకుండా వేరే వ్యక్తి పాయింటాఫ్ వ్యూలో ఈ కథను చెప్పి ఉంటే ఈ కథకు ఇకాస్త సాధికారిత వచ్చేదనిపిస్తుంది. అలాగే ఈ కథ పాలిటిక్స్ పై సెటైర్ టోన్ లో నడవలేదు కానీ అలా నడవాల్సిన వ్యవహారమే. ఎందుకంటే చాలా సీన్స్ సినిమా టెక్ గా లిబర్టీ తీసుకుని రియాల్టీకి దూరంగా వెళ్తాయి.
ఇక ఫస్టాఫ్ ఈ కథలో టెంపో అదిరిపోయే స్దాయిలో నడిస్తే సెకండాఫ్ కు వచ్చేసరికి హీరో పాత్ర డమ్మీ అయిపోయినట్లుగా సమస్యల్లో చిక్కుకుని ప్యాసివ్ అయిపోతుంది. సమస్యల్లో ఇరుక్కున్నాక..ఎత్తుకు పై ఎత్తులు వేయలేదు. చివర్లో తన భార్య వచ్చి ఎమోషనల్ గా సాయి చేసే దాకా కథ లేవలేదు. దాంతో అప్పటివరకూ హై పిచ్ లో నడిచిన సినిమా కాస్తా స్లో అయినట్లు అనిపించింది. ఇక క్లైమాక్స్ అర్దాంతరంగా ముగించినట్లు అయ్యింది. అయితే ఆ కథకు అంతకు మించిన క్లైమాక్స్ ని ఊహించలేం.
విలన్ ఏడి
ఈ సినిమాలో ప్రధాన సమస్య..సరైన ప్రతినాయకుడు అంటే విలన్ పాత్ర లేకపోవటం అనిపిస్తుంది. అతనిలోని ఇన్నర్ కాంప్లిక్ట్ ఉన్నా, బయిటనుంచి వచ్చే కాంప్లిక్ట్..గా కనిపించే సరైన విలన్ లేడు. ఉన్న ఒక్క విలన్ ..మన హీరోని చూసి భయపడి దారి ఇవ్వటమే సరిపోతుంది. హీరోకు,విలన్ కు మధ్య విభేధం వచ్చిన సన్నివేశాలు కూడా బలంగా ఉండవు. అవన్నీ తేలిపోయాయి. దాంతో హీరోను అడ్డగించే శక్తి సినిమాలో లేకపోవటంతో సినిమా సెకండాఫ్ చప్పగా మారిపోయింది.
పూర్వపు తేజం
హిట్ సినిమాకు కొన్ని లక్షణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే...తేజ ఈ సినిమాని ఎక్కడా బిగి సడలకుండా , ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలకు వచ్చిన సమస్య సెకండాఫ్ సో..సో గా ఉండటం..ఈ సినిమా కూడా అలాంటి సమస్య ని ఎదుర్కొన్నా...స్టోరీలో ఉన్న బలంతో లాగేసాడు.
లేకపోతే ..లేనట్లే
నిజానికి ఈ సినిమాని కామెడీ టచ్ కలిపితే అల్లరి నరేష్ తో చేయాలి. ఎందుకంటే డ్రామా మొత్తం చాలా అసహజంగా జరుగూతూంటుంది. అయితే తన నటనతో, తన బాహుబలి ఇమేజ్ తో , తన ఎత్తుకు తగ్గ ఆకారంతో సినిమాపై ఆసక్తి చావకుండా కాపాడగలిగాడు రానా. రానా నడక, వెనక నుంచి వచ్చే జోగేంద్ర ఆర్.ఆర్ సినిమా డ్రాప్ అవకుండ కాపాడగలిగాయి. కాబట్టి రానా లేకపోతే ఈ సినిమాలేనట్లే. కాజల్ పాత్ర గురించి పెద్ద చెప్పుకునేదేమీ లేదు..ఆమె బాగా చేసిందని చెప్పినా రొటీనే.
నవదీప్,కేధరిన్, జోష్ రవి
నవదీప్ క్యారక్టర్ లాంటింది ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్లో వస్తుంది. అదేమీ ఊహకు అందనిది మాత్రం కాదు. అయితే ఆ పాత్ర వల్ల కథకు కానీ, జోగేంద్ర పాత్రకు గానీ ఒరిగిందేమీ లేకపోవటమే విచిత్రం. ఇక కేథరిన్ పోషించిన దేవికారాణి పాత్ర ...కు కావాల్సిన రానా నుంచి శృంగారమా లేక ప్రేమా అనేది మనకూ..అఫ్ కోర్స్ ఆ పాత్రకు కూడా సందేహం ఉండి ఉంటుంది. అంత కన్ఫూజన్ గా ఉంటుందీ పాత్ర. ఇక జోష్ రవి పాత్ర సినిమా అంతా మొదటి నుంచి చివరి వరకూ ఉంది. అద్బుతం అని చెప్పలేం కానీ తీసి పారేసేలా మాత్రం లేదు. కాకపోతే సినిమా కథలో కలిసి, ఏదన్నా మలుపుకు కారణమయ్యే పాత్ర అయితే మరింతగా పేరు వచ్చేది.
వీళ్లు సైతం
ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలి డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. వాడు జోగేంద్ర..అంటూ డైలాగ్ చెబుతూ మరోవైపు ప్రభాస్ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో అదరకొట్టాడు.
డైలాగులే బలం
''సినిమాల్లో నటించే ఒక మహానుభావుడు పార్టీ పెడితే అక్కడా మేమే. ఒక మాస్ హీరో పార్టీ పెడితే అక్కడా మేమే. విప్లవ భావజాలం ఉన్నాయన పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఇంకెవరన్నా రేపు కొత్తగా పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఏ పార్టి గెలిచినా ఏ కొత్త నేత వచ్చి పార్టీ పెట్టినా.. మేం మాత్రం ఎప్పుడూ అధికారంలో ఉంటాం'' ఇలాంటి సుత్తి లేకుండా..సూటిగా గుచ్చుకునే డైలాగు తెరపై విని ఎన్నాళ్లైంది. అప్పుడెప్పుడో కోడి రామకృష్ణ...చేసిన పొలిటికల్ సెటైర్ సినిమాల్లో వినిపించేవి ఇలాంటివి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' వినగలిగాం. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలా వినిపిస్తాయి. డైలాగుల రచయిత లక్ష్మీభూపాల్ కి ఈ సినిమాలో కెరీర్ లో చెప్పుకోదగ్గ మలుపు అవుతుంది.
టెక్నికల్ గా ...
అనూప్ మ్యూజిక్ ఓకే. నువ్వే నువ్వే సాంగ్, జోగేంద్ర టైటిల్ సాంగ్ ఇలా అన్ని మాంటేజ్ సాంగ్స్ బాగున్నాయి అనిపించాయి. ఆర్ ఆర్ కూడా ఫరవాలేదు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌లో కొన్ని సాగదీత సీన్లను ట్రిమ్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్ ధాట్..
చాయ్ వాలాని ప్రధానమంత్రి ని చేసిన మన దేశంలో ...ఓ సాధారణ యువకుడు పాలిటిక్స్ లోకి వచ్చి ఎదిగి సీఎం అవ్వాలంటే మర్డర్స్ చేయాలి, మానభంగాలు చేయాలి..అని చెప్తూంటే మనం ఆరాధించే పొలిటీషన్స్ పైనా సందేహాలు వస్తున్నాయి. ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు కాదు..వేసాక కూడా..
‘మరీ అంత నిజాయితీగా వుండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా వున్న చెట్లనే కదా!’ అని ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం.
ఏమి బాగుంది: 'లీడర్' నుంచి జోగేంద్రగా ఎదిగిన రానా అభినయం
ఏం బాగోలేదు: సెకండాఫ్ లో విలన్ రంగంలోకి దిగి..ఎటాక్స్ చేస్తూంటే హీరో నిశ్సహాయంగా చూస్తూ డల్ అయ్యినప్పుడు , క్లైమాక్స్
ఎప్పుడు విసుగెత్తింది : హీరోయిన్ చచ్చిపోయినప్పుడు...అందుకు సంస్కారాలు చూపిస్తూ పాట వస్తున్నప్పుడు
చూడచ్చా ?: ఖచ్చితంగా..ఈ దేశ రాజకీయాలను మీరే కాదు...సినిమాలు తిడుతున్నాయనే ఆనందంతో...