'పిజ్జా' లాంటి సినిమా...(రాజ్ తరణ్ 'అంధగాడు' రివ్యూ)
అవునూ...హీరో క్యారక్టర్ అనాధ అయినా ఫర్వాలేదు అంధుడు మాత్రం అవ్వటానికి వీల్దేదు. ఎందుకంటే అంధుడు అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆ కథలో ఎలా కూర్చగలం... ఆ పాత్రపైన సానుభూతి రాకుండా...ఎలా సీన్స్ అల్లుతాం. ముఖ్యంగా ఆర్ట్ సినిమా లుక్ రాకుండా ఎలా అడ్డుకోగలం ఇవన్నీ సమస్యలే. అందుకే అంధత్వం మీద కథలు కత్తి మీద సాములాంటివి. అప్పుడెప్పుడో కమల్ ..అమావస్య చంద్రుడు...ఈ మధ్యన మోహన్ లాల్ కనుపాప(మళయాళం ఒప్పం) క్రైమ్ ధ్రిల్లర్ వంటి ఒకటో రెండో రిఫెరెన్స్ లుగా కనపడతాయి. మధ్యలో శ్రీను ...వాసంతి..లక్ష్మి వంటివి వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
ఇలాంటి పరిస్దితుల్లో ఓ రచయిత తను దర్శకుడుగా మారుతూ తొలి చిత్రానికి ఇలాంటి భిన్నమైన బ్యాక్ డ్రాప్ ఉన్న కథనే ఎన్నుకోవటం గొప్ప విషయం.అలాగే యంగ్ హీరో రాజ్ తరణ్ సైతం ధైర్యమే చేసాడని చెప్పాలి. ఈ నేఫధ్యంలో అంధత్వం బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం సక్సెస్ అవుతుందా...అసలు కథేంటి...ఈ సినిమా చూస్తూంటే ఎంజాయ్ చేస్తామా..అంధుల మీద సానుభూతి వస్తుందా...ముఖ్యంగా సినిమాలో సగటు ప్రేక్షకుడుని అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా వంటి ప్రశ్నలకు సమధానం కావాలంటే రివ్యూ చదలాల్సిందే.
ఇదీ కథ
పుట్టుకతోనే అంధుడైన గౌతమ్ (రాజ్ తరుణ్) అంధుల అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. ఎప్పుడూ ఉషారుగా ఉండే గౌతమ్ కాలక్రమేణా రేడియో జాకీగా స్థిరపడి లవ్ గురుగా జనాలకు సలహాలు ఇస్తూంటాడు. ఎవరైనా కళ్లు దానం చేస్తే తన జీవితంలో వెలుగు వస్తుంది అని ఎదురుచూస్తున్న అతనికి నేత్ర (హెబ్బా పటేల్) అనే ఓ డాక్టర్‌తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది.తను అంధుడుని అనే విషయం తెలిస్తే ..ఆమె తనను వదిలేస్తుందని... కష్టపడి కళ్లున్నవాడిగా నటిస్తూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే ఓ రోజు నేత్రకు అసలు విషయం రివీల్ అయిపోతుంది. గౌతమ్ గుడ్డివాడన్న నిజం నేత్రకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ తర్వాత అతని ప్రేమలో నిజాయితీ తెలుసుకుని..అతనికి కళ్లు వచ్చే ఏర్పాటు చేస్తుంది.
కళ్లు వచ్చిన గౌతమ్ ఆ ఆనందం అనుభవించేలోగా...ఓ కొత్త సమస్య కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్) రూపంలో ఎదురౌతుంది. కులకర్ణి ఓ ఆత్మ.. అతను గౌతమ్‌ని వెంబడిస్తూంటాడు. ఎందుకూ అంటే... కులకర్ణి కళ్లనే.. గౌతమ్‌కి అమర్చారు. అందుకే.. ఆ ఆత్మ కేవలం గౌతమ్‌కి మాత్రమే కనిపిస్తూ తన కోరికలు తీర్చమంటాడు. ఆ కోరికల తీర్చగలిగావా అంటే... రెండు మర్డర్స్. వేరే దారిలే ఆ ఆత్మ పోరు పడలేక ..గౌతమ్ ఓ మర్డర్ చేసేస్తాడు.రెండో మర్డర్ కూడా చేయమని పోరుతూంటాడు. మరి గౌతమ్ అందుకు ఒప్పుకొన్నాడా? అసలు కులకర్ణి ఎవరు? తన పగ ఎవరిపైన? నేత్రతో గౌతమ్ ప్రేమ కథ ఏ మలుపు తీసుకుంది వంటి ప్రశ్నలకు సమాధానం వెండితెరపైనే లభిస్తుంది.
విశ్లేషణ..
ఫస్టాఫ్ ఓకే...సెకండాఫే వీక్
సాధారణంగా ఓ రైటర్ ..దర్శకుడు గా మారుతున్నారంటే అద్బుతమైన స్క్రిప్టుతో అతను ముందుకు వస్తున్నాడని అర్దమవుతుంది. అతని బలం అయిన కథ,డైలాగులు, స్క్రీన్ ప్లే వంటివి విశ్వరూపం తెరపై కనపడుతుందని ఆశిస్తాం. అలాగే ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు స్రిప్టులు అందించిన సీనియర్ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ...దర్శకుడుగా మారుతున్నాడన్నా అంతా అలాగే ఎదురుచూసారు. అందుకు తగినట్లుగానే ఆయన తన తొలి చిత్రం కథని విభిన్నమైన నేపధ్యం తీసుకున్నారు. అయితే ట్రైట్ మెంట్ విషయం దగ్గరకి వచ్చేసరికి రొటీన్ ఫార్ములాను ఎంచుకున్నారు. దాంతో అసలు ట్విట్ రివీల్ అయ్యే దాకా అంటే ఫస్టాఫ్ పూర్తి అయ్యి..ఇంటర్వెల్ వచ్చేదాకా ...ఓ కొత్త తరహా సినిమా చూస్తున్నాం అనే ఫీల్ ఉంటుంది.
ఎప్పుడైతే సెకండాఫ్ కు వచ్చి కథ..ఆత్మ, కోరికలు అంటూ టర్న్ తీసుకుందో అక్కడ నుంచి రొటీన్ గా అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆత్మ పాత్ర రాజేంద్రప్రసాద్, రాజ్ తరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కావాలని బలవంతంగా ఇరికించినట్లు ఉన్నాయి కానీ ఎక్కడా ఫన్ వర్కవుట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ దాకా అదే పరిస్దితి. కాని క్లైమాక్స్ లో దర్శకుడు తన కథన నైపుణ్యంతో ఓ ట్విస్ట్ ఇచ్చి ఒక్కసారిగా స్టోరీ గ్రాఫ్ ని లేపి, బాగుందనిపించాడు. కాని రెగ్యులర్ రివేంజ్ డ్రామానే కొత్తగా చెప్పటం మాత్రం మెచ్చుకోదగ్గ అంశమే. అయితే ట్విస్ట్ లు,టర్న్ ల మీద పెట్టిన శ్రద్ర ...సెకండాఫ్ ట్రీట్ మెంట్ మీద పెట్టి మరింత టైట్ గా చేసి ఉంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అయ్యేది.
ప్యాసివ్ పాత్రే దెబ్బ కొట్టింది
సినిమాలో మొదటి నుంచీ చివరి వరకూ...హీరో తన లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాను అనకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ పోవటం జరిగింది. ముఖ్యంగా విలన్ కు ..అసలు హీరో ఎవరో ..తన వెనకే ఎందుకు పడుతున్నాడో తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేసింది. దాంతో హీరోకు విలన్ కు మధ్య చిన్న ఫైట్ తప్ప వేరే ఏమీ లేకుండా పోయింది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారిపోయి, చాలా చోట్ల బోర్ కొట్టేసింది.
దానికి తగినట్లు... ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కంటి డాక్టర్ అయ్యిండి కూడా... చూపులేని హీరో తన దగ్గర చూపున్నట్టు నటిస్తున్నా ఏమాత్రం కనిపెట్టలేకపోవడం, అలాగే అతన్ని ప్రేమించేయడం కూడా చాలా అవాస్తవంగా అనిపిస్తుంది. ఎంత సినిమా టెక్ అనుకుందామనుకున్నా మనస్సు ఒప్పదు.
పిజ్జా స్క్రీమ్...స్క్రీన్ ప్లేనే
(స్పాయిలర్ ఎలర్ట్...ఈ పేరా మాత్రం సినిమా చూసినవాళ్లే చదవటం మంచింది)
మనకు ఈ సినిమా చూస్తూంటే తమిళంలో వచ్చిన పిజ్జా చిత్రం గుర్తుకు రాకమానదు. దాదాపు అదీ ఇదే తరహా స్క్రీన్ ప్లేతోనే నడుస్తుంది. అయితే అందులో హర్రర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో కామెడీకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నడిపించారు..అదే తేడా. రెండూ ఒకే తల్లి బిడ్డలుగా కనపడతాయి.
దర్శకత్వం మొదటిసారైనా
ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన వెలిగొండ శ్రీనివాస్... దర్శకుడుగా మంచి మార్కులే వేయించుకున్నారు. అన్ని డిపార్టమెంట్ ల నుంచి మంచి అవుట్ పుట్ నే తీసుకున్నారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, షాయీజీ షిండే, జయప్రకాష్ రెడ్డి వంటి సీనియర్స్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్నా ఎక్కడా తడబాటు లేకుండా బాగా చేయించారు. అయితే ఆయనలో రచయితే ..దర్శకుడుని డామినేట్ చేసారని చెప్పాలి. ఎందుకంటే సినిమా చూసాక దర్శకుడు గుర్తుకు రాడు..రచయిత గుర్తుకువస్తారు. . కామెడీ సీన్లు ఎంత బాగా తీసాడో, థ్రిల్ కలిగించే సీన్లు అంత కన్నా బాగా డీల్ చేశాడు దర్శకుడు. తొలి ప్రయత్నమే అయినా తనదైన ముద్రవేసి,తెలుగు పరిశ్రమకు మరో కమర్షియల్ దర్సకుడు దొరికాడనే ధీమా కలిగిస్తుంది.
కళ్లు ఉన్నప్పుడు..లేనప్పుడు కూడా...
ఈ కథని ముందుకు నడిపించింది హీరో రాజ్ తరుణే లోని ఎనర్జీనే . అంధుడుగా ఎంత బాగా చేసాడో... కళ్లొచ్చిన తర్వాత.. తన బాడీ లాంగ్వేజ్ ని.. మాట తీరు ని మార్చేసి తనలోని నటుడుని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. హెబ్బా పటేల్ కు చేయటానికి ఏమీ లేదు..పాటలకు, అందాల ప్రదర్శనకు పరిమితమైంది. రాజేంద్ర ప్రసాద్ నుంచి ఇంకా ఎక్కువ కామెడీ ఎక్సపెక్ట్ చేస్తాం. అదే లోపించిందనిపించింది. కమిడయన్ సత్య హీరోకు సైడ్ కిక్ గా బాగానే నవ్విస్తాడు.
టెక్నికల్ గా ..
సాంకేతికంగా చూస్తే శేఖర్ చంద్ర పాటలు ఆహా...ఓహో అనిపించవు కానీ ఓకే అనిపిస్తాయి, నేపథ్య సంగీతం కూడా అంతే. సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటర్ మరింత చొరవతో..రాజేంద్రప్రసాద్, రాజ్ తరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలను తొలిగిస్తే ఆయనకు ధాంక్స్ చెప్పుకుందుము. ఏకె ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.మాటలు అక్కడక్కడ బాగా పేలాయి.
బోటమ్ లైన్
ఫైనల్ గా ఈ చిత్రం మరీ కొత్తదీ కాదు..మరీ పాతది కాదు...ఒక్కసారి చూడటానికి సమస్యలేనిది. అక్కడక్కడా నవ్వుకోవటానికి, ట్విస్ట్ లు ఎంజాయ్ చేయటానికి ఈ సినిమా వీకెండ్ మంచి కాలక్షేపమే. అలాగే ఈ సినిమా రికమెంట్ చేయటానికి మరో కారణం .. కళ్ళు దానం చేస్తే ఎంత ఉపయోగమో ఎంతో హృద్యంగా చెప్పే సన్నేవేశాలు ఉండటమే..ఈ సినిమా చూసి కొందరిని కళ్లు దానం వైపు కదిలించినా సంతోషమే కదా. ఇలాగ అన్నానని ఇదేదో సీరియస్ సినిమా అనుకోకండి..సుమా.