జస్ట్ ఛిల్...(‘ఛల్ మోహన్ రంగ’ మూవీ రివ్యూ)
అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజు రోడ్డు మీద ఏదో పనిమీద వెళ్లి అక్కడో అమ్మాయిని చూస్తాడు..అమ్మాయి కూడా కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు కదా అని ఆలస్యం చేయకుండా అతన్ని పలకరిస్తుంది. పది నిముషాల్లోలోగా ఇద్దరూ ప్రేమలో పీక లోతులో మునిగిపోతారు. ఆ తర్వాత ఏం జరగాలి...కట్..కట్ ...ఇద్దరూ విడిపోవాలి..ఎందుకంటే ఇంట్రవెల్ టైమ్ దగ్గరపడిపోయింది. అయినా విడిపోతేనే కదా మళ్లి కలవగలిగేది అని రైటర్ గారు చాలా గట్టిగా చెప్పారయ్యే.
అలా బ్రేకప్ అవ్వటం కోసం..అప్పటికప్పుడు కారణం వెతుక్కుంటే దొరక్క...పాతకాలం సినిమాలు గుర్తు చేసుకుని అపోహలు..అపార్దాలు స్కీమ్ లు ని ఫాలో అయిపోతారు. ఆ తర్వాత వెనువెంటనే రొటీన్ గా వచ్చే వియోగం, విరహం వంటి ఎపిసోడ్స్ అయ్యేసరికి హీరోయిన్ కు ఓ బకరాతో పెళ్లి నిశ్చయం..
పెళ్లి టైమ్ దగ్గరపడుతూంటే... ఇద్దరి మనుస్సుల్లో ఆరాటం.. తాము విధివశాత్తు విడిపోయినా...మనస్సులు కలిసే ఉన్నాయని గ్రహింపుకు ఓ రాత్రివేళ వచ్చి..ఆఖరికి ఆ పెళ్లి చెడకొట్టుకుని ఇద్దరూ ఒకటి అవుతారు.
ఇలాంటి రొమాంటిక్ కామెడీ కథలు కేవలం తెలుగులోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా బోలెడు వచ్చేసాయి...వస్తున్నాయి...ఇంకా వస్తాయి. తెలిసిన కథలా అనిపించే ఈ రొమాంటిక్ కామెడీ ఫార్మెట్ కు కొత్తదనం అంతా దర్శకుడు ఆ కథని డీల్ చేసే విధానంలోనే ఉంటుంది. ‘ఛల్ మోహన్ రంగ’ కూడా అదే ఫార్మెట్ లో వచ్చిన చిత్రమే. అయితే మరి దర్శకుడు ఎలా డీల్ చేసాడు. కొత్తదనం కథనంలో తీసుకువచ్చాడా...త్రివిక్రమ్ అందించిన కథలో స్పెషాలిటి ఏమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
మోహన్ రంగా అమెరికా యాత్ర..
అమెరికా వెళ్లితే ఒకే దెబ్బతో సెటిల్ అవ్వచ్చు అని ఆలోచించే..సగటు మిడిల్ క్లాస్ కుర్రాడు మోహన్ రంగా(నితిన్). పట్టిన పట్టు వదలకుండా...రకరకాల స్కెచ్ లు వేసి అమెరికా వెళ్తాడు. అక్కడ మళ్లీ కొన్ని ఇబ్బందులు పడి జాబ్ సంపాదించి సెటిల్ అవుతాడు. ఈలోగా అతనికి ఓ ఎన్నారై మేఘ సుబ్రమణ్యం (మేఘ ఆకాష్) పరిచయం అవుతుంది. కొద్ది రోజులుకే ప్రేమగా మారుతుంది. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. కానీ భిన్న వ్యక్తిత్వాలు గల ఈ ఇద్దరూ ఓ చిన్న అనుమానం లాంటి అపార్దంతో ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకోలేరు.
ఈ లోగా తన తల్లితో పాటు ఇండియాకు వచ్చేస్తుంది మేఘ. ఆమెను మర్చిపోదామనుకున్నా మోహన్ రంగాకు సాధ్యం కాదు. దాంతో అతనూ ఇండియాకు వస్తాడు. అతను ఇండియా వచ్చేటప్పటికి ఆమె త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ లాగ పెద్దలు చూపించిన కుర్రాడుతో పెళ్లి ఓకే చేసి, ఆ హడావిడిలో ఉంటుంది. అప్పుడు మోహన్ రంగా ఏం చేసాడు...ఎలా వాళ్లిద్దరూ ఒకటయ్యారు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.
దోబూచిలాట లేదు
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. ప్రేమలు మాత్రం భూమి మీదే మొదలవుతాయి. ప్రేమ..పెళ్లి ఒకరితో అయితే స్వర్గం ఇక్కడే సృష్టించబడుతుంది...ఈ పాయింట్ ని నమ్మే చాలా ప్రేమ కథలు తెరకెక్కుతూంటాయి. అయితే ఆ ప్రేమ కథని చెప్పే విధానంలో నిజాయితీ ఉంటే కనెక్ట్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. లేకుండా ఓ బోర్ ప్రేమ కథగా చూసేవారికి భారంగా తయారువుతుంది. రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటి ప్రేమ కథలని డీల్ చేయటం నిజానికి కష్టమైన పనే. కృష్ణ చైతన్య దర్శకుడుగా ఆ భాథ్యని భుజాన వేసుకున్నంత ఈజీగా మోయలేకపోయారనే చెప్పాలి. ఎందుకంటే కామెడీ సీన్స్ పండించింతంగా ఎమోషన్ సీన్స్ వర్కవుట్ చేయలేకపోయారు. సినిమా అలా ..అలా చూస్తున్నంతసేపు వెళ్లిపోయిందే కానీ ఎక్కడా మన హృదయంలోకి వచ్చి దోబూచిలాడలేదు. సినిమాకు కీలకమైన ఇద్దరి వ్యక్తిత్వాలను,వాటిలోని వైవిధ్యాన్ని స్పష్టంగా సీన్స్ లో చూపించలేకపోయాడు. కేవలం డైలాగులతో చెప్పి దాటేసాడు. దాంతో క్యారక్టర్స్ మధ్య వచ్చే కాంప్లిక్ట్ రిజిస్టర్ కాలేదు.
అమోఘమూ కాదు..అలాగని ఘోరమూ కాదు..
త్రివిక్రమ్ అందించిన ఈ కథ...లైటర్ వీన్ తో ఆయన మార్క్ ప్రాస డైలాగులతో నడిచిపోయింది. అంతవరకూ ఓకే. కానీ ఎక్కడా బలమైన ముద్ర వేయలేదు. ఇంట్రవెల్ దగ్గర ..ఇద్దరు ప్రేమలో పడటానికి కారణాలు ఎలా ఉండవో..విడిపోవటానికి దారణమైన సంఘనటలు కూడా అవసరం లేదు అని నమ్మి..చాలా సాదా సీదా ఇంట్రవెల్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్, దర్శకుడు సాదాసీదాగా విడిపోవచ్చు..చిన్న అపార్దంతో అనుకోవచ్చు ..కానీ నితిన్ వంటి స్టార్ హీరో ...అలా పెద్ద కారణం లేకుండా ఓ కొత్త కుర్రాడు ప్రేమలో బ్రేకప్ తీసుకున్నట్లు చేస్తే కష్టమనిపిస్తుంది. దానికి సాలిడ్ రీజన్ కావాలనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ సాలిడ్ రీజన్ ఉంటుందో..సెకండాఫ్ దాని చుట్టూ సీన్స్ పడతాయి. సన్నివేశాల్లో సంఘర్షణ వచ్చి..ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అదే ఇక్క మిస్సైంది. లేకపోతే మరో నువ్వు నాకు నచ్చావు లాంటి కథ అయ్యేది.
హైలెట్స్
నితిన్ నటన, సినిమాలో అక్కడక్కడా వచ్చే త్రివిక్రమ్ మార్క్ డైలాగులు. సెకండాఫ్ లో వచ్చే పార్టీ కామెడీ ఎపిసోడ్. . ‘నువ్వు పెద్దపులి’ పాట, కెమెరా వర్క్.
టెక్నికల్ గా...
మేకింగ్ పరంగా కృష్ణ చైతన్య... ఫస్ట్ క్లాస్ లో పాసైనా..కథకు తగ్గ ట్రీట్ మెంట్ రాసుకోవటంలో ఆయన విఫలమయ్యారు. అదే తెరపై స్పష్టంగా కనపడింది. ఈ సినిమా కు ఏకైక ప్లస్ పాయింట్ కెమెరా వర్క్. నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ సినిమాని విజువల్ ట్రీట్ గా మార్చేసింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ అద్బతం కాదు కానీ ఓకే. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు హైలెట్.
ఫైనల్ ధాట్
త్రివిక్రమ్ మ్యాజిక్ ..ఆయనకే కాదు..వేరే వాళ్లకి అంతగా వర్కవుట్ అవటం లేదు