పాకిస్దాన్ కీ జై ...('టైగర్ జిందా హై' రివ్యూ)
జేమ్స్ బాండ్ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా మోజు తగ్గిపోతూ వస్తోంది. అయితే మన హీరోలకు మాత్రం ఆ పాత్రపై రోజు రోజుకీ మోజు పెరిగిపోతోంది. మొన్నా మధ్య అజిత్ ...జేమ్స్ బాండ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి...వివేగం అంటే ఇదిగో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ... 'టైగర్ జిందా హై' అంటూ దూకేసాడు. ఇరాక్ వెళ్లి ఓ నలభై మంది నర్సులను... టెర్రరిస్ట్ లనుంచి వీరోచితంగా పోరాడి రక్షించేసాడు. మరి ఈ లోకల్ జేమ్స్ బాండ్ ని ప్రపంచం ఆమోదించి ఆదరిస్తుందా...సల్మాన్ అభిమానులు మాత్రమే మోయాలా... లోకల్ జేమ్స్ బాండ్ గా సల్మాన్ ఏ విన్యాసాలు చేసాడు...సినిమాలో అసలు కథేంటి...‘ట్యూబ్‌లైట్’తో భారీగా దెబ్బతిన్న సల్మాన్‌కు వూరటనిచ్చిందా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం...
కథ
‘ఏక్ థా టైగర్’సినిమా ఎండింగ్ లో అజ్ఞాతంలోకి వెళ్లిన టైగర్(సల్మాన్ ఖాన్) తన ప్రేయసి, పాక్ గూఢచారి జోయా(కత్రినా కైఫ్)ను పెళ్లి చేసుకొని ఆస్ట్రియాలో తన కుమారుడు జూనియర్ తో సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే ఈ లోగా అతని అవసరం భారత ప్రభుత్వానికి వస్తుంది. తప్పనిసరి పరిస్దితుల్లో మళ్లీ డ్రస్ వేసుకుని, తుపాకి పట్టుకుని రంగంలోకి దూకాల్సి వస్తుంది.
అంతర్యుద్ధం తీవ్రంగా ఉండే ఇర్కిట్ (ఇరాక్) లో కొందరు నర్సులను (25 భారతీయ నర్సులు, 15 పాకిస్తానీ నర్సులు.) ఐసిస్ తీవ్రవాదులు హైజాక్ చేస్తారు. దాంతో అమెరికా దానిపై వారం రోజుల్లో క్షిపణితో దాడి చేయాలనీ నిర్ణయించుకుంటుంది. ఆ దాడి జరిగితే నర్సులు ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి.
ఈ వారం లోగా వాళ్ళను కాపాడే బాధ్యత భారతీయ సీక్రెట్ ఏజెన్సీ సంస్ద 'రా' తీసుకుంటుంది. ఆ తర్వాత ఆలోచించి..వాళ్లను విడిపించే సమర్దుడు టైగర్ అని నిర్ణయిస్తుంది. దాంతో అజ్ఞాతంలో ఉన్న అతని కోసం ఆన్వేషించి,ఎడ్రస్ పట్టుకుని ఒప్పిస్తుంది. అప్పుడు టైగర్ తిరిగి డ్యూటిలో చేరి ఇరాక్ బయిలుదేరతాడు. భార్య జోయాతో కలిసి ఓ టీమ్ ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదులపై యుద్దానికి దిగుతాడు.
అందుకోసం ... టెర్రరిస్టుల ఆయిల్ రిఫైనరీ లో తన టీం తో సహా ఉద్యోగులుగా చేరిన టైగర్, అక్కడ నుంచి పక్కా ప్లానింగ్ తో ఆసుపత్రిలో అడుగుపెడతాడు. చుట్టూ వలయంలా కమ్ముకున్న టెర్రరిస్ట్ లను ఎదుర్కొని టైగర్... నర్సులను ఎలా కాపాడి తీసుకొచ్చాడు అనేది క్లైమాక్స్. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఇండియన్ జేమ్స్ బాండ్ ఆగయా
యాక్షన్..యాక్షన్ ..యాక్షన్ ..ఈ సినిమా గురించి మూడు మాటల్లో చెప్పాలంటే ఇదే చెప్పాలి. కథ...సినిమా పుట్టిన రోజులంత పాతది అయినా...ఆ కథని ఎలాగయినా బ్రతికించాలి అని కంకణం కట్టుకున్నట్లుగా దర్శకుడు చక్కగా,చిక్కగా స్క్రిప్టు రాసుకుని యాక్షన్ ఎపిసోడ్స్ తో విశ్వరూపం చూపించేసాడు.
యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తూంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకుని వచ్చారు.
సల్మాన్ కూడా సాధ్యమైనంతవరకూ సీరియస్ ఫేస్ పెడుతూ..అవకాసం ఉన్న చోటల్లా చొక్కా విప్పి తన కండలు చూపెడుతూ... ఇండియన్ రాంబోలా రెచ్చిపోయాడు. కత్రినా కైఫ్ కూడా తానేం తీసిపోలేదన్నట్లుగా...ఎప్పటిలా అందచందాల ప్రదర్శన ప్రక్కన పెట్టి..ఫైట్స్ చేస్తూ తెరపై ప్రత్యర్దులకే కాక మనకూ చుక్కలు చూపించేసింది.
సీక్వెల్ ఏమంది
సీక్వెల్ సినిమాలకు ఎప్పుడూ పొంచి ఉండే ప్రమాదం...తొలి సినిమాతో పోల్చి చూడటం...ఏ మాత్రం ఆ సినిమా స్దాయిని అందుకోలేకపోయినా ప్చ్..అని పెదవి విరిచేయటం జరుగుతుంది. అయితే ఈ సీక్వెల్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. మొదటి సినిమా ‘ఏక్ థా టైగర్’ కు రెండో సినిమా 'టైగర్ జిందా హై' కు మధ్య ఐదేళ్ల గ్యాప్ ఉంది. దాంతో తొలి చిత్రంతో పోల్చి చూసుకునే కార్యక్రమం తక్కువ స్దాయిలో ఉండే అవకాసం ఉంది.
పాకిస్దాన్ ప్రేక్షకుల కోసం పాట్లు
సల్మాన్ ఖాన్ కు పాకిస్దాన్ లోనూ మంచి మార్కెట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవటానికో మరేమో కానీ సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగుల్లోనే కాకుండా.. ఇండియన్ రా ఏంజెట్స్...పాకిస్దాన్ ఐఎస్ ఐ ఏజెంట్స్ ని కలిపి ఒకే మిషన్ మీద పంపటం...రెండు జెండాలు ఒకే సారి ఎగరటం వంటివి చూపించారు. అవన్ని చూస్తూంటే పాకిస్దాన్ ప్రేక్షకుల మనో భావాలు దెబ్బ తినకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు అర్దమవుతుంది. వాళ్లు పండగ చేసుకుంటారేమో కానీ అవి మనకు మాత్రం అతిగా అనిపిస్తాయి.
బాగున్నావి..బాగోలేనివి
టెక్నికల్ గా హై స్టాండర్డ్ తో సినిమాని తీసారు. దర్శకుడుగా అలీ అబ్బాస్ జాఫర్ సక్సెస్ అయినా స్క్రిప్టు రైటర్ గా మాత్రం కానట్లే అనిపిస్తుంది. ఎందుకంటే కథనం చాలా ప్లాట్ గా ఉంది. ఆ ఫ్లాట్ నెరేషన్ తో తో పది నిమిషాలకో ఫైట్ తో మొదటి నుంచి చివరి దాకా బులెట్లు స్క్రీన్ మీద దిగుతూనే ఉంటాయి. అలాగే చిత్రంలో యాక్షన్ సన్నివేశాలే ప్రధానమైనా.. సెంటిమెంట్, రొమాన్స్, భారత్-పాక్ మధ్య సంబంధాలను చూపించటం కోసం బలవతంగా చాలా సీన్స్ కలిపాడు..కానీ .అవి కథలో కలవలేదు. కానీ యాక్షన్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది.
సాధారణంగా సల్మాన్ సినిమాల్లో కనపించే ఎంటర్టైన్మెంట్ కాని, కిక్కిచే పాటలు కాని ఈ సినిమాలో లేవు. . కత్రినా కైఫ్ పాత్ర చాలా పరిమితంగా ఉంది, చాలా కాలం తర్వాత సల్మాన్ సినిమాలో కనిపించిన పరేష్ రావల్ రేంజ్ కి తగ్గ పాత్ర లేదు.
ఫైనల్ థాట్
యాక్షన్ మూవీ లవర్స్ కు, సల్మాన్ ఖాన్ ఫాన్స్ కు అదిరిపోయింది అన్నట్లుగా అనిపించే ఈ సినిమా సాధారణ ..సగటు ప్రేక్షకుడికి మాత్రం కనెక్ట్ కావడం కొంచెం కష్టమే అనిపిస్తుంది.