కార్తీ 'ఖాకీ' మూవీ రివ్యూ
దమ్మున్న పోలీసోడి కథ ...(కార్తీ 'ఖాకీ' మూవీ రివ్యూ)
పోలీస్ కథలంటే హీరోలకు భలే ఇష్టం... ఎందుకంటే యాక్షన్ కు బోలెడు స్కోప్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రజా ప్రయోజనం ఉన్న ఫేస్ బుక్ పోస్ట్ ల లాంటి డైలాగులు కుప్పలు తెప్పలు గా చెప్పచ్చు...ఎమోషన్ సీన్స్ లో...చక్కగా మీసం తిప్పచ్చు..ముఖ్యంగా పోలీస్ సినిమాలకు బి,సి సెంటర్లలలో మినిమం కలెక్షన్స్ రప్పించగల సత్తా ఉండటంతో ...హిట్ గ్యారెంటీ అనిపిస్తుంది. అందుకే దాదాపు ప్రతీ హీరో తమకు సెట్ అయినా కాకపోయినా కెరీర్ లో కొన్నైనా పోలీస్ కథలు ట్రై చేసి ఉంటారు. అందరిలాగే తమిళ హీరో కార్తీ కూడా గతంలో పోలీస్ కథలు చేసాడు. ఈ సారి కూడా మళ్లీ చేసాడు. అయితే కార్తీని మరోసారి పోలీస్ కథ చేసేటంత ప్రేరేపించిన అంశం ఈ కథలో ఏముంది. హిట్ లకు దూరంగా ప్రయాణం చేస్తున్న కార్తీ... ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తానని నమ్మటానికి కారణమేంటి...తెలుగులోనూ రిలీజైన ఈ సినిమా ఇక్కడ మనకు వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు తెలియాలంటే వాస్తవానికి వెళ్లి సినిమా చూడాలి..అయితే ప్రస్తుతానికి రివ్యూ చదవండి.
కథేంటి...
1995లో చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో కథ మొదలవుతుంది. అప్పట్లో హైవేల పక్కనున్న ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడి, దారుణంగా హత్యలు చేస్తుంటుంది దండుపాళ్లం టైప్ లో ఉన్న ఓ ముఠా. వాళ్లు అడవిలో వేటాడుతున్నట్లుగా నాగరిక సమాజంలోని మనుష్యులను అతి కిరాతకంగా చంపుతూంటారు. దాంతో జనం భయభ్రాంతులకు లోనువుతూంటారు. ఈ కేసులో ఆ క్రిమినల్స్ చంపే విధానం మినహా ప్రత్యేకమైన క్లూ ఏమీ ఉండదు. పోలీస్ లు చేతులు ఎత్తేస్తారు. మీడియా మొత్తం పోలీస్ లను ఏకి పారేస్తూంటుంది. ఈ క్రమంలో కొత్తగా డీఎస్పీగా జాబ్ లో జాయిన్ అయిన థీరజ్ కుమార్ (కార్తీ) వద్దకు ఈ కేసు ఫైల్ వస్తుంది. జాబ్ లో చేరిన కొద్ది రోజుల్లోనే చాలా సిన్సియర్ అధికారిగా..పట్టుకున్న ఎలాంటి కేసుని అయినా ఛేథించే సత్తా ఉన్నవాడుగా పేరు తెచ్చుకున్న థీరజ్ ఈ క్రైమ్ ని చాలా సీరియస్ గా తీసుకుని తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు.
చిన్న చిన్న క్లూలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూంటే ఆ ముఠా...ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య (రకుల్ ప్రీతి) మీదే దాడికి పాల్పడుతుంది. దాంతో థీరజ్ లో కసి,పట్టుదల ఇంకా పెరుగుతుంది. అక్కడ నుంచి పని రాక్షసుడులా రాత్రిబవళ్లూ ఆ క్రిమినల్స్ కోసం వేట మొదలెడతాడు. దేశం మొత్తం చిన్న వేలి ముద్ర పట్టుకుని వెతుకుతాడు. అలా అతి తక్కువ క్లూలతో ఎన్నో రాష్ట్రాల్లో అలజడి లేపిన కొందరు భయంకర క్రిమినల్స్ ని చాలా కష్టపడి, దేశం మొత్తం తిరిగి ధీరజ్ అంతమొందింస్తాడు. అసలు ఆ క్రిమినల్స్ ఎవరు...వాళ్ల గత చరిత్ర ఏమిటి..వాళ్ల క్రూరత్వం ఎటువంటిది... క్రిమినల్స్ పట్టుకునే ప్రాసెస్ లో థీరజ్ వేసిన ప్లాన్స్ ఏమిటి, క్రిమినల్స్ థీరజ్ ని ఎలా ఇరికించాలనుకున్నారు...వంటి విషయాలు చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. తెరపై చూస్తేనే మజా.
ఏంటీ ఈ సినిమా స్పెషాలిటీ
పోలీస్ సినిమాలు ఎన్నో వస్తూంటాయి.పోతూంటాయి...కొన్ని మాత్రమే కలకాలం చెప్పుకునేలా ఉంటాయి. అలాంటి సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా. సాధారణంగా ...మనకు పోలీస్ సినిమా అనగానే సాయి కుమార్ పోలీస్ స్టోరి తో మొదలెట్టి...రవితేజ విక్రమార్కుడు,సూర్య సింగం, పవన్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ టెంపర్ దాకా బోలెడు సినిమాలు వరస పెట్టి గుర్తు వస్తాయి. అయితే వాస్తవ సంఘటనలతో తీసిన సినిమాలు మన దగ్గర బాగా తక్కువ. పూర్తి కమర్షియల్ యాంగిల్ లో మన పోలీస్ సినిమాలు తెరకెక్కుతూంటాయి. కానీ ఈ చిత్రం చూస్తూంటే మన కళ్లెదరుగా ఆ సంఘటనలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత.
హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే
1985 నుంచి 2005 మధ్య కాలంలో 45కు పైగా దోపిడీలకు పాల్పడి, 18 హత్యలు చేసి, 64మంది జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఓ నిజమైన ముఠా చుట్టూ అల్లిన కథ ఇది. ఎక్కువ సంఘటనలు ఉంటాయి కానీ అది ఓ కథ గా చెప్పటం చాలా కష్టమే. అయితే దర్శకుడు దాన్నిసమర్ధవంతంగా సాధించాడు. కేవలం సినిమా మొదట్లో వాస్తవ సంఘటనలు బేక్ చేసుకుని తీసామని సినిమా మొదట్లో ఓ కార్డ్ వేయటం మాత్రమే కాకుండా కథ,కథనం పూర్తి స్దాయి రీసెర్చ్ చేసుకుని చిన్న చిన్న ఎలిమెంట్స్ ని కూడా వదలకుండా పూర్తి స్పష్టతతో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా చూస్తూంటే మనకు పోలీస్ శాఖపై గౌరవం పెరగటమే కాకుండా దర్శకుడు ఎంత కష్టపడి విషయ సేకరణ చేసి ఆ అంశాలన్నిటినీ ఒక వరసలో పెట్టుకుని స్క్రీన్ ప్లే గా రాసుకున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా దర్శకుడు ... కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో దోపిడీ హంతకుల్ని పట్టుకోవడానికి పోలీసులు పడే శ్రమ, కష్టం కళ్ళకు కట్టినట్టు చూపించటమే హైలెట్ అయ్యింది. అలాగే ఆ దోపిడీ హంతకుల ముఠా హవేరియాలు ఎలా ఉంటారు, వాళ్ళ క్రూరత్వం ఎటువంటిది, వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీలు చేశారు అనే విషయాల్ని చాలా వివరంగా చూపించారు. అతని కష్టానికి హ్యాట్యాఫ్ అని చెప్పాలనిపిస్తుంది.
ఇక దర్శకుడుకు పూర్తి స్దాయిలో తన నటనతో సహకరించాడు హీరో కార్తి. పూర్తి సీరియస్ టోన్ తో సినిమాని అలవోకగా అలా .అలా నడిపించేసాడు. నిజంగా తెలివైన పోలీస్ అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించాడు.
అదొక్కటే లోటు
ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఎలిమెంట్స్ ఏమీ కనపడవు. అంటే కామెడీ, కిక్ ఇచ్చే పాటలు వంటివి. అయితే ఆ ఎలిమెంట్స్ ని యాక్షన్ ఎపిసోడ్స్ భర్తి చేసాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కేక పెట్టిస్తే..సెకండాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్, రాజస్థాన్ నేరస్థుడిని పట్టుకునేటప్పుడు బస్‌లో జరిగే యాక్షన్ పార్ట్ , అలాగే క్లైమాక్స్ సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.
మరో దండపాళ్యం
అయితే సినిమా చూస్తున్నప్పుడు చాలా సార్లు దండుపాళ్యం సినిమా గుర్తుకు రావటం కాకతాళీయమే కావచ్చు. కానీ ఆ సినిమాలకన్నా అద్బుతంగా డీల్ చేసారు దర్శకుడు.
టెక్నికల్ గా ..
సత్యన్ సూరన్ కెమేరా వర్క్ సినిమాకు హైలెట్ గా నిలిస్తే , జిబ్రాన్ నేపథ్య సంగీతం సీన్స్ ని ఎలివేట్ చేసింది. సుబ్బరాయన్ యాక్షన్ సినిమాకు హై స్టాండర్డ్స్ ని ఇచ్చింది. మిగతా విభాగాలు సినిమాకు తగ్గట్లే ఉన్నట్లే ఉన్నాయి. అయితే ఫస్టాఫ్ లో కార్తి, రకుల్ రొమాన్స్ కు చెందిన కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది.
ఫైనల్ థాట్
మన తెలుగులోనూ ఇలాంటి ఇన్విస్టిగేషన్ తో కూడిన వాస్తవికతను ప్రతిబింబించే పోలీస్ కథలు వస్తే బాగుండును అనిపిస్తుంది.
ఏమి బాగుంది: సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని
ఏం బాగోలేదు: యాక్షన్ సినిమా అని చెప్పి హీరో,హీరోయిన్స్ రొమాన్స్ తో సినిమా ప్రారంభించి, బోర్ కొట్టించటం
ఎప్పుడు విసుగెత్తింది : అలాంటి సీన్స్ లేవు
చూడచ్చా ?: యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లు