'పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఎమ్' రివ్యూ
ఫస్టాఫ్ గరుడ ..సెకండాఫ్ తాబేలు('పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఎమ్' రివ్యూ)
ఒకప్పుడు... యాక్షన్ సినిమాలకు కేరాప్ ఎడ్రస్ గా వెలిగిన రాజశేఖర్ ఈ మధ్యకాలంలో వివాదాలు తప్ప హిట్ అనేది దరిచేరలేదు. పలు కారణాలతో ..ఆయనతో భారీ బడ్జెట్ పెట్టి యాక్షన్ సినిమా చేసే నిర్మాతలు, ఆయన కోసం కథ రాసుకునే దర్శకులు సైతం కరవు అయ్యారు. దాంతో దాదాపు ఫేడవుట్ దశకు చేరుకున్న రాజశేఖర్..ఇక క్యారక్టర్ రోల్స్ కు షిప్ట్ అయిపోతాడనుకున్నారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ... ఈ సినిమా మొదలైంది. అంతా లైట్ అనుకున్నారు.
అయితే ఓ రోజు ట్రైలర్ వదలగానే అందులో విజువల్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు..మళ్లీ అర్జెంటుగా మనస్సు మార్చుకుని రాజశేఖర్ కు టైమ్ స్టార్టైంది అనుకున్నారు. దానికి తోడు మగాడు -2 అనిపించే కథ అంటూ దర్శకుడు సైతం ఊరించాడు. అంచనాలు పెరిగాయి. వాటిని ఈ సినిమా అందుకుందా...ఇంతకీ ఈ సినిమాతో రాజశేఖర్ కు మళ్లీ పునర్ వైభవం వచ్చినట్టేనా, ఆశలు రేపిన ట్రైలర్ కు తగ్గ స్దాయిలోనే సినిమా కూడా ఉందా...మార్కెట్ పెద్దగా లేని ఈ టైమ్ లో రాజశేఖర్ పై అంత బడ్జెట్ పెట్టేలా నమ్మించిన కథ ఏంటి.. ఈ కథకు పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఎమ్ అనే టైటిల్ పెట్టడానికి గల కారణమేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి :
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) లో పనిచేస్తూంటాడు చంద్రశేఖర్(రాజశేఖర్). నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) కూడా సీబీ ఐ టైప్ అన్నమాట. రకరకాల కుట్రలు, స్కామ్ లను బయిటపెడుతూంటూంటుంది. అందులో అధికారిగా పనిచేసే చంద్ర శేఖర్ కు తను చేసే ఉద్యోగం, భాధ్యతలు గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. చాలా సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన పరిస్దితి. దాంతో చివరకు తన భార్య స్వాతి(పూజాకుమార్)కు కూడా తనేం చేస్తున్నాడో చెప్పలేని పరిస్దితి. ఎప్పుడూ చూసినా పని..పని..పని అన్నట్లు కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగుతూండటంతో ఆవిడ విడాకులకు అప్లై చేస్తుంది. దాంతో ఉద్యోగానికే రిజైన్ చేయాలి ఫిక్స్ అవుతాడు.
అయితే ఈ లోగా ఓ కేసు అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. నిరంజన్(అదిత్ అరుణ్) అనే హ్యాకర్ ని చంపటానికి ఇద్దరు షూటర్స్ ప్రయత్నిస్తున్నారని, దాని వెనక పెద్ద కుట్ర ఉందని, అది దేశానికి ప్రమాదం అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో రాజీనామా విషయం వదిలేసి..ఆ కుట్రను ఛేదించటం మొదలెడతాడు. నిరంజన్ ను పట్టుకుని అతన్ని ....ఎందుకు చంపాలనుకున్నారు? అని ఆ దిశగా ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈలోగా చంద్రశేఖర్ పైనా దాడులు జరుగుతాయి. కేసు కాంప్లికేటెడ్ అయిపోతుంది.
అసలు ఇంతకీ విలన్స్ ఎవరు... క్రిమినల్ జార్జీ (కిషోర్)కు ఈ కేసుతో సంభందం ఏమిటి... ఆ కుట్ర దేనికి సంభందించింది... భార్యతో విడాకులు విషయం ఏమైంది.. తదితర అంశాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
ఫస్టాఫ్ కేక..సెకండాఫ్ ఊక
ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా ...ఫస్టాప్ ..గరుడ వేగ అన్న టైటిల్ కు తగ్గట్లుగా మనోవేగంతో సీన్స్ పరుగెత్తాయి. ఎక్కడా సెకన్ గ్యాప్ ఇవ్వకుండా ఎంగేజ్ చేయగలిగాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ తో సెకండాఫ్ మీద బాగా నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేసాయి. అయితే సెకండాఫ్ తేలిపోయింది. కథలోని అసలు విషయం ఎప్పుడైతే రివీల్ అయ్యిందో అక్కడ నుంచీ నత్త నడక మొదలైంది. కథ గుంజకు కట్టిన .. గానుగెద్దులా అక్కడక్కడే తిరగటం మొదలైంది. దానికి తోడు అప్పటిదాకా లేని పొలిటకల్ సీన్స్ కథలోకి వచ్చి విసిగించటం మొదలెట్టాయి.
ముఖ్యంగా కథలో కీలకమైన అంశమైన ప్లుటోనియం మైనింగ్ స్కామ్ విషయాన్ని అర్దమయ్యేలా చెప్పటంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి.
ఈ సినిమా కథ అంతా అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే ఫ్లుటోనియం ఎక్స్ పోర్ట్ కు సంబందించిన స్కామ్ కు చెందింది.. అయితే ఈ విషయాన్ని టెక్నికల్ యాంగిల్ లో చెప్తూ...సర్వర్ అంటూ సెకండ్ హాఫ్ సినిమా సాగించటమే ఇబ్బందిగా మారింది. అలాగే విలన్ ను భీబత్సమైన బిల్డప్ తో ఎస్టాబ్లిష్ చేసి చివరకు చాలా సిల్లిగా సింపుల్ గా చంపేసారు.
అంతెందుకు సెకండాఫ్ ఎంత రొటీన్ అయ్యిపోయిందంటే ... హీరో భార్యను విలన్ కిడ్నాప్ చేసి తీసుకు వచ్చి..లొంగిపో అని బెదిరించేటంత... ఇక విలన్ పాత్ర చేసిన ..కిషోర్ ఎంతో శక్తిమంతుడు అన్నట్లుగా ట్రైలర్స్ చూపించారు. సినిమాలో అంత సీన్ లేదు అన్నట్లు సీన్స్ రాసుకున్నారు.
అయితే సినిమా ప్రారంభంలో వచ్చే జార్జియాలోని బైక్ ఛేజింగ్, డ్యామ్ సీన్స్, సెకండాఫ్ లో బాంబ్ ట్రాకింగ్ సీన్ మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉంది...ప్రవీణ్ సత్తార్ ..ఇలాంటి కొన్ని సీన్స్ తో తన సత్తా ఏంటో చూపించారు. సన్నిలియోన్ పాట..మాస్ ని టార్గెట్ చేసారు.
వీటిని మెచ్చుకోకుండా ఉండలేం
అలాగని సినిమాని కొట్టి పారేయలేం. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది. కెమెరా వర్క్ కూడా సూపర్బ్ అనిపించేలా , హాలీవుడ్ సినిమా డబ్బింగ్ చేసారా అన్నట్లుగా షాట్స్ ఉండి ఆశ్చర్యపరుస్తూంటాయి. రాజశేఖర్ వయస్సు మీద పడినట్లు కనపడినా..ఆయనలో స్పీడు, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. యాక్షన్ సినిమాలు మళ్లీ ఆయనతో ప్లాన్ చేసుకోవచ్చు అని భరోసా ఇచ్చారు ఈ సినిమాతో. హ్యాకర్ గా అదిత్ అరుణ్ చాలా న్యాచురల్ గా కనిపించాడు. ఎడిటింగ్ ఓకే కాని సెకండాఫ్ ఇంకొంత ట్రిమ్ చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
హాలీవుడ్ సినిమాలా తెలుగు సినిమా తియ్యాలనుకోవటం మెచ్చుకోదగ్గదే. అయితే సినిమా మొత్తం అదే ప్లో మెయింటైన్ చేయాలి..లేకపోతే ..సగం పెట్టి మేనత్త సామెతలా నిరాశపరుస్తుంది.
ఏమి బాగుంది: రాజశేఖర్ ని చాలా కాలం తర్వాత మళ్లీ పూర్తి స్దాయి యాక్షన్ హీరోలా చూడటం
ఏం బాగోలేదు: రాజశేఖర్ కు అతని భార్య కు మధ్య వచ్చే బోరింగ్ సీన్స్ ,సాంగ్
ఎప్పుడు విసుగెత్తింది : హీరో భార్యని ఎత్తుకొచ్చి విలన్ ... హీరోని లొంగిపో అని బెదిరిస్తూంటే...
చూడచ్చా ?: యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది..అయితే వారికి ప్లుటోనియం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సర్వర్ వంటి విషయాలపై అవగాహన ఉంటే అర్దమయ్యే అవకాసం కూడా ఉంది.