రాజా..ఇది పక్కా రవితేజ సినిమా (‘రాజా ది గ్రేట్’ రివ్యూ)
పనీపాటా లేని ఓ విలన్..ఓ రోజున.. రకరకాల కారణాలతో ...హీరోయిన్ ని పెళ్లాడెయ్యాలనో లేక చంపెయ్యాలనో డెసిషన్ తీసుకుని, అదే పని మీద ఎంత డబ్బు ఖర్చైనా, ఎంత టైమ్ వేస్ట్ అయినా ఫర్వాలేదని తిరుగుతూంటాడు. దాంతో ఆమె వీడెవడురా బాబూ ఇలా తగులుకున్నాడని .. దిక్కు తోచని స్దితిలో పరుగులు పెడుతూంటుంది. అప్పుడు ...నేనున్నా ...ఆపదలో ఉన్న అమ్మాయిలని ముఖ్యంగా అందంగా ఉండేవారిని రక్షించటమే నా కర్తవ్యం, నా జీవితాశయం అన్నట్లుగా ఓ వ్యక్తి సీన్ లోకి దూకుతాడు.
ప్రక్కనున్న వాళ్లు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనకెందుకు.. టైమ్ వేస్ట్..ఆ కాస్త టైమ్ ఉంటే ఫేస్ బుక్ లో చక్కగా ఓ రెండు పోస్ట్ లు పెట్టుకోవచ్చు...వాట్సప్ లో రెండు వీడియోలు చూసుకోవచ్చు.. ట్విట్టర్ లో ఓ రెండు ట్వీట్స్ చేయచ్చు అని ఆలోచించే ఈ సోషల్ మీడియా రోజుల్లో ధైర్యంగా అంత సాహసం చేసేది ఎవరూ అంటే... మన రొటీన్ యాక్షన్ సినిమాల్లో హీరోనే.
ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించుట అనే ఫార్ములాతో ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చూసాం..హిట్ చేసాం... మరి ఇలాంటి రొట్టకొట్టుడు ఫార్ములా పాయింట్ ని అడ్డం పెట్టి రెండు గంటలు పైగా జనాలని థియోటర్ లో కూర్చోపెట్టడానికి ఎంత టాలెంట్ కావాలి...అది దర్శకుడు అనీల్ రావిపూడి వద్ద బోలెడు ఉందని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది.
ఇంతకీ ఈ సినిమాలో హీరో పైన చెప్పుకున్నట్లుగా... రొటీన్ యాక్షన్ హీరో బాపతా లేక ఏమన్నా వైవైద్యం చూపించారా...సినిమా అంతా హీరోని అంధుడుగా చూపించామని చెప్పబడుతున్న ఆ కథ ఏంటి... ఎనర్జీకి మారుపేరైన రవితేజకు కమ్ బ్యాక్ సినిమా అవుతుందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి..
అతనో అంధుడు..పేరు రాజా ది గ్రేట్ (రవితేజ). అయితే అతను బ్లైండ్ అయినా ఫుల్లీ ట్రైన్డ్. ఆత్మవిశ్వాసం పాళ్లు కూసింత ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక) పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. కాని రాజా అంధుడు అవటంతో అది సాధ్యం కాదు. అయితే అతనికి పోలీస్ డిపార్టమెంట్ కు సాయిం చేసే అవకాసం వస్తుంది.
అదెలా అంటే... ఓ స్ట్రిక్టు పోలీస్ అథికారి (ప్రకాష్‌రాజ్) ఓ కేసు విషయంలో విలన్ దేవ(వివన్ భటేనా) తమ్ముడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు . తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో ప్రకాష్ రాజ్ పైనా, అందుకు సహకరించిందనే కోపంతో ..ఆయన కుమార్తె లక్కీ(మెహరీన్) పైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. కానీ లక్కీ తప్పించుకుని పారిపోతుంది.
అప్పటినుంచి దేవ ఆమె కోసం వెతుకుతూంటే...అతని నుంచి తప్పించుకుని తిరుగుతూంటుంది లక్కీ. మరో ప్రక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తుంటుంది. కానీ వాళ్లకూ కష్టమవుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజా రంగంలోకి దూకుతాడు. అక్కడ నుంచి అంధుడైన అతను అతి క్రూరమైన విలన్ నుంచి , గ్యాంగ్ నుంచి లక్కీని ఎలా కాపాడాడు? ఇంతకీ రాజాకు ఆమెను కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆ పని మాత్రం చేయకండి..
కథగా చెప్పుకోవటానికి ఏ మాత్రం కొత్తదనం గానీ, థ్రిల్లింగ్ గానీ లేని ఈ సినిమాలో హీరోని అంధుడుని చేయటం ఒక్కటే చెప్పుకోదగ్గ విషయం. అది మిగతా హీరోల మీద అయితే ఎలా పండేదో ఏమో కానీ..రవితేజ మాత్రం ఆడేసుకున్నాడు. అసలే అనీల్ రావిపూడిది కామెడీ వ్యవహారం. రవితేజ ది సేమ్ టు సేమ్ కామెడీ టింజ్. దాంతో నీరసంగా హీరోయిన్ కనపడే సీన్లు, పాటల్లో తప్ప సినిమా అంతటా ఫైట్స్ తో సహా కామెడీ ట్రై చేసారు. కానీ కథను వదిలేసారు. హీరో రంగ ప్రవేశం చేసేటంత వరకూ రెచ్చిపోయిన విలన్..అదేంటో ఆ తర్వాత పాసివ్ గా మారిపోయి..దెబ్బలు తిని వచ్చిన తన గ్యాంగ్ ని చూసుకోవటం, హీరో గొప్పతనాన్ని ఒప్పుకుంటూ భజన చేయటం చేస్తూంటాడు. దాంతో హీరో, విలన్ మధ్య జరిగాల్సిన పోరు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఎంతసేపూ రవితేజదే పై చేయి. దానికి తోడు...అంధుడైనా.. ఆ లోపమనేది లేదేమో అనిపించేలా రవితేజ...ఫైట్స్ గట్రా చేసేస్తూంటాడు. ఇదేమన్నా ఆర్ట్ సినిమానా.ఇలాంటి ప్రశ్నలు వేయటానికి, ఇది కమర్షియల్ సినిమా అంటే అసలు మాట్లాడాల్సిన పనేలేదు. ఒప్పం వంటి సినిమాల్లో అంధుడుగా చేసిన మోహన్ లాల్ వంటి వారు పెట్టుకున్న లిమిటేషన్స్....గుర్తుకువస్తే...ఆశ్చర్యం వేస్తుంది. లాజిక్ లు వంటివి ఈ సినిమాలో పొరపాటున కూడా వెతికే ప్రయత్నమే చేయకుండా ఉంటే మంచిది.
గౌరవం పోయిండేది..
అలాగే సినిమా ప్రీ క్లైమాక్స్ దగ్గరలో ఓ పెద్ద ఫైట్ జరుగుతుంది. అది అయిపోగానే..సినిమా అయిపోయిందనుకుంటాం అంతా..అయితే ఇంకా ఉంది అని మళ్లీ మొదలెడతాడు దర్శకుడు.. అలాంటి విషయాల్లో ఎడిటర్, దర్శకుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అయితే దర్శకుడుని ఒకందుకు మెచ్చుకోవాలి. సినిమా మొత్తంలో హీరో-హీరోయిన్‌ల మధ్య ఎక్కడా లవ్ ట్రాక్ కనిపించదు. వారి మధ్య కెమిస్ట్రీ చూపించలేదు. నిజంగా ఆ సీన్స్ కనుక పెట్టి ఉంటే కనుక..సినిమాపై అప్పటివరకూ ఉన్న గౌరవం కాస్తా పోయిందే. అఫ్ కోర్స్ లవ్ తో సంభందం లేకుండా పాటలు వచ్చిపోతుంటాయి అనుకోండి.
రవితేజ..ది గ్రేట్..కానీ
ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..ఈ సినిమాలో మరే ఏ ఇతర హీరోని అసలు ఊహించుకోలేం. ఎక్కడా కొంచెం కూడా అల్లరి,ఎనర్జీ తగ్గలేదు రవితేజలో..రవితేజ ..ది గ్రేట్ అనాలనిపిస్తుంది చివరలో.
టెక్నికల్ గా చూస్తే... మెహన్ కృష్ణ సినిమాటోగ్రఫి సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా డార్జిలింగ్ లో తీసిన సీన్ చాలా రిచ్ గా ముచ్చటగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లోనూ కెమెరా వర్క్ బాగుంది. సాయి కార్తీక్ పాటలు జస్ట్ ఓకే..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. దిల్ రాజు నిర్మాత అయినప్పుడు నిర్మాణ విలువలు అంటూ ప్రత్యేకంగా ఏమి రాసినా ,మాట్లాడినా బాగుండదు. ఆయన స్దాయి ని ఆయన ఎప్పుడూ తగ్గించుకోరు. కేవలం కామెడీ సీన్స్ కాకుండా సినిమా కథపై కూడా దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే ఖచ్చితంగా మరింత మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది.
క్లైమాక్స్ సీన్స్ లో రాధిక చెప్పే డైలాగులుకి థియోటర్ లో విజిల్స్ పడ్డాయి. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి సినిమా అంతా కనపడుతూ మరోసారి తనదైన నటనతో అలరించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంపత్, తనికెళ్ల భరణి ఎప్పటిలాగే.. తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు
ఫైనల్ థాట్
కామెడీ సీన్స్, డిఫరెంట్ క్యారక్టరైజన్స్, మ్యానరిజమ్స్ రాసుకునే అనీల్ రావిపూడి...కథ కూడా అంతే డిఫరెంట్ గా ఎందుకు డిజైన్ చేసుకోలేకపోతున్నారో..కానీ దాన్ని అధిగమిస్తే టాప్ డైరక్టర్స్ లో ఒకరు అవుతారు.
ఏమి బాగుంది: అంధుడైన హీరో పాత్రలో కనిపించే కాన్ఫిడెన్స్
ఏం బాగోలేదు: అంధుడైన హీరో అవధులు లేకుండా అచ్చ తెలుగు హీరోలా తెరపై రెచ్చిపోవటం
ఎప్పుడు విసుగెత్తింది : అత్తారింటికి దారేదిని గుర్తే చేసే... సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్
చూడచ్చా ?: కామెడీ, మసాలా తో కూడిన రవితేజ మార్క్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది