రొటీన్ కథతోనే సినిమా మరణం ('యుద్ధం శరణం' మూవీ రివ్యూ)
అనగనగా ఓ హీరో.. అతనో అనాధ. అబ్బబ్బే...మరీ పుట్టు అనాధ కాదు... అతని చిన్నప్పుడే అతని కళ్లెదరుగా తల్లి,తండ్రులను చంపేస్తారు. అక్కడ నుంచి ఆ పసివాడు పగ అనే ఉగ్గుపాలని తాగి పెరిగి పెద్దై, తన పేరెంట్స్ ని చంపిన వాళ్లను చంపేయటమే జీవితాశయం గా పెట్టుకుంటాడు. అతని ఆశయం నెరవేర్చటానికా అన్నట్లు... లక్కీగా ఆ విలన్ కూడా ఏ యాక్సిడెంట్ లోనో, లేక మరో ప్రాణాంతమైన జబ్బో చేసి చావకుండా..హీరో పగ తీర్చుకునేందుకు అనువుగా, ఇంకా చెప్పాలంటే గుర్తు పట్టేందుకు అనువుగా ...రూపం కూడా మారకుండా అలాగే ఉండి వెయిట్ చేస్తూంటాడు. కాకపోతే అప్పట్లో రౌడీగా ఉన్న అతను కెరీర్ పరంగా పెరిగి ఏ మాఫియా డానో అవుతాడు.
ఈ పరిస్దితుల్లో మన హీరో..కష్టపడి ఆ విలన్ కూతురుని లైన్లో పెట్టి, అల్లుడు రూపంలో మానసిక క్షోభ పెట్టి, ఆ తర్వాత తీరిగ్గా నేను..ఫలానా వాడ్ని అని చెప్పి చంపేస్తాడు. ఇలాంటి సినిమా కథలకు అప్పట్లో డిమాండ్ ఉండేదో ఏమో కానీ తెగ వచ్చేవి. ప్రతీ హీరో ...ఇలాంటి కథలను చేయటానికి ఉత్సాహం చూపేవారు. అయితే కాలం మారింది. సినిమా మారింది. కానీ అప్పుడప్పుడూ పాత కథలను తవ్వి..ఆ జ్ఞాపకాలను మన ముందుకు తెచ్చేవాళ్లు మాత్రం మారటం లేదు. అలాంటి కాస్త కాలం చెల్లిన క్రైమ్ కథతో చైతూ ఈ రోజు మన ముందుకు వచ్చాడు. అయితే ఆ పాత కథకు కొద్ది పాటి మార్పులు చేసారు. ఏమిటా మార్పులు...అర్జున్ రెడ్డి,నేనే రాజు నేనే మంత్రి వంటి డిఫరెంట్ సినిమాలను మమైకమై చూస్తున్న సినిమా యూత్ కు నచ్చుతుందా... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
డ్రోన్స్ డిజైనర్ ...అర్జున్(నాగచైతన్య)ది ఓ ప్రేమాలయం టైప్ ఫ్యామిలి. తల్లి,తండ్రి (రావు రమేష్, రేవతి) డాక్టర్స్...వాళ్ల ద్గగరకు ట్రైనీగా వచ్చిన అంజలి(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడ్డ అర్జున్, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలని నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతని వాళ్లు ఊహించని విధంగా చనిపోతారు. వారిది హత్య అని అర్దమవుతుంది అర్జున్ కు. నాయక్ (శ్రీకాంత్)అనే క్రిమినల్ ...వాళ్లను చంపారని తెలుసుకుని, పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. అసలు నాయక్ కు అర్జున్ తల్లి,తండ్రిని చంపాల్సిన పని ఏమొచ్చింది.. అర్జున్ ఎలా నాయక్ పై పగ తీర్చుకున్నాడు, అర్జున్ ప్రేమ కథ చివరకు ఏ టర్న్ తీసుకుంది అనేది మిగతా కథ.
హత్య..పగ...ప్రతీకారం
ఇంతకు ముందు నాగచైతన్య చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’కు కొంచెం అటూ ఇటూలో ఉండే సినిమానే ఇది. సినిమా కథ పాతదయినా, కథనం కొత్తగా ఉంటే ఆ సినిమాని భుజాన మేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలో కథ,కథనం రెండూ ఓల్డ్ ఫ్యాషన్డ్ గా ఉంటాయి. ఎక్కడా ..అరే భలే ఉంది అనిపించే మూవ్ మెంట్స్ లేకుండా జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకున్నాడు. అలాగే ఈ సీరియస్ సినిమాకు కాస్త ఫన్ యాడ్ చేసి ఉంటే కొంతలో కొంత చూసే జనాలను రక్షించినట్లు అయ్యేది. ముఖ్యంగా సబ్ ప్లాట్స్ లేకుండా సింగిల్ థ్రెడ్ మీద ..హత్య,పగ, ప్రతీకారం స్కీమ్ లో సాగుతూండటం దెబ్బ కొట్టింది. అన్నిటికన్నా పెద్ద మైనస్ ఏమిటంటే..ఫీల్ గుడ్ కథను క్రైమ్ స్టోరీ గా మార్చే విలన్స్ క్యారక్టరైజేషన్స్ చాలా వీక్ గా ఉండటం. సినిమా స్లోగా నడిపితే క్లాసిక్ అవుతుంది అనే భ్రమలో బోర్ కొట్టించే కార్యక్రమం పెట్టుకున్నాడు డైరక్టర్ అనిపించింది. అదేం చిత్రమో కానీ తన పేరెంట్స్ ని కోల్పోయిన వాడి కథ చూస్తున్నట్లు అనిపించదు. అ పెయిన్ కానీ, పగ కాని చైతూ ఫేస్ లో కనపడదు. అది డైరక్టర్ గొప్పతనమో లేక హీరో గొప్పతనమో కానీ.
శ్రీకాంత్ కు ప్లస్ అవుతుందా
శ్రీకాంత్ కెరీర్ ప్రారంభం రోజుల్లో సీతారత్నం గారి అబ్బాయి,అబ్బాయిగారు వంటి కొన్ని చిత్రాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేసారు. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తి స్దాయి విలన్ గా కనిపించాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అయితే ఆయన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. లేకపోతే లెజండ్ చిత్రం జగపతిబాబు కెరీర్ కు టర్న్ ఇచ్చినట్లు ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి విలన్ గా బిజీ చేసును.
కొత్తతరం దర్శకుడు..పాతకాలం నాటి ప్రతిభ
కథని ఎంచుకోవటంతోనే ఈ దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. చాలా రొటీన్ కథను అంతకన్నా రొటీన్ గా తీసి, ఏం పాముకుందామనుకున్నాడో ఈ డైరక్టర్ కే తెలియాలి. కొత్తగా పరచయమయ్యే ఈ తరం దర్శకుడు నుంచి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఎక్సపెక్ట్ చేయం..సినిమా ఫ్లాఫో, హిట్టో తన మార్క్ ఉండాలి. తమ టాలెంట్ బయిడపడాలి. అంతేకాని ఇలా సేఫ్ జోన్ లో ఉందామని ప్రయత్నిస్తే ..ఫలితం కాస్త తేడాగానే ఉంటుంది.
చైతూకు కలిసిరాని జానర్
ఎన్నాళ్లు లవ్ స్టోరీలు చేస్తాం...యాక్షన్ సినిమాలు చేస్తూ తోటి హీరోలు దూసుకుపోతూంటే అని నాగచైతన్యకు అనిపించి ఈ సినిమా చేసి ఉండవచ్చు. లేదా దడ,బెడవాడ, ఆటోనగర్ సూర్య, ‘సాహసం శ్వాసగా సాగిపో’ను మర్చిపోయి ఉండవచ్చు. అయితే యాక్షన్ అయినా మరొక జానర్ అయినా సినిమాలో కొత్తగా విషయం ఉంటేనే ఫలితం బాగుంటుందని చైతన్య గుర్తించాలి.
టెక్నికల్ గా ఈ సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే సినిమాకు మేజర్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ నిఖేత్ బొమ్మిరెడ్డి అని చెప్పాలి. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగున్నా, పాటలు అసలు బాగాలేవు. దర్శకుడు మారిముత్తు ఇలాంటి కాలం చెల్లిన కథని నిర్మాతలతో ఒప్పించటమే గొప్ప విషయం. ఆ టెక్నిక్స్ ఔత్సాహిక దర్శకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఎప్పటిలాగే వారాహి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ థాట్
ఫస్టాఫ్ ఎంత అదిరిపోయినా... సెకండాఫ్ బాగోపోతే సినిమా ఓవరాల్ గా బాగుండదు అనే విషయం మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. కాబట్టి...సెకండాఫ్ కు జై..దాన్ని పట్టించుకోకపోతే ఓల్ సేల్ గా నై.
ఏమి బాగుంది: ఫస్టాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్
ఏం బాగోలేదు: సెకండాఫ్ లో వచ్చే మైండ్ గేమ్ అనబడే..మతిలేని గేమ్
ఎప్పుడు విసుగెత్తింది : ఒకచోట అని చెప్పలేం...చాలా చోట్ల
చూడచ్చా ?: రొటీన్ సినిమాలను కూడా రొటీన్ గా ఎంజాయ్ చేసే ఓపికుంటే ఖచ్చితంగా