గోపీచంద్ 'గౌతమ్నంద' సినిమా రివ్యూ
అప్పుటి రాజు-పేద ఇప్పుటి 'గౌతమ్-నంద' (రివ్యూ)
అనగనగా ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు. వాళ్లలో ఒకరు డబ్బున్నవాడు,మరొకడు నిష్ట దరిద్రుడు పుడతారు. ఇద్దరూ తమ తమఅదృష్ట,దురదృష్టాలను ద్వేషిస్తూంటారు. డబ్బున్న వాడికి పనిపాటాలేని బోర్ కొట్టే ఆ జీవితం నచ్చదు..డబ్బు లేని వాడికి ఆ దరిద్రంలో వచ్చే కష్టాలు నచ్చవు. అలా సతమతమవుతూ కథలో టైం వచ్చినప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఎదురౌతారు. ఒకేరకంగా ఉండటం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. కాస్సేపటికి తెప్పరిల్లి తమ కథలు..బాధలు చెప్పుకుంటారు. ఒకరికి మరొకరికి వింతగా ఉంటాయి. ఇద్దరికి నమ్మబుద్ది కాదు. సర్లే ఒకపనిచేద్దాం... ఇద్దరం ప్లేస్ లు మార్చుకుని ఒకరిలా మరొకరు కొంతకాలం బ్రతుకుదామని ఫిక్స్ అవుతారు. అప్పుడేం అవుతుంది.
ఎన్టీఆర్ ' రాజు- పేద' సినిమా అవుతుంది. లేదా అక్కినేని .. 'ఇద్దరు మిత్రులు', చిరంజీవి 'దొంగమొగుడు', 'రౌడి అల్లుడు' లాంటి ఎన్నో సినిమాలు అవుతాయి. అవి ఆ కాలనికి తగ్గ కథలు..మరి ఈ కాలంలో అదే కాన్సెప్టుని రిపీట్ చేస్తే 'గౌతమ్నంద' సినిమా అవుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు తెరెకెక్కిన ఈ డ్యూయిల్ రోల్ వ్యవహారంలో, ప్రెడిక్టుబుల్ కథలో సంపత్ నంది ఏం మార్పులు చేసారు. అసలే సక్సెస్ లేక కొట్టిమిట్టాడుతున్న గోపీచంద్ ఈ సినిమా ఒప్పుకోవటానికి ఏం విషయం కనిపించింది..అసలు ఇలాంటి కథలు ఈ రోజుల్లో ఆడతాయా వంటి విషయాలు తెలియటం కోసం రివ్యూ చదవండి.
కథేంటి...
ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) ఏకైక వారసుడు ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్). పుట్టినప్పుడు నుంచి డబ్బులో మునిగి తేలిన గౌతమ్ కు ఆకలి,కష్టం,బాధ,కన్నీళ్లు వంటి బేసిక్ ఎమోషన్స్ కూడా అనుభవంలోకి రాకపోవటంలో వింతలేదు. తెల్లారిలేచింది మొదలు పార్టీలు, పబ్ లు, డ్రగ్స్ అంటూ తిరిగే అతని జీవితంలో ఓ సంఘటన మార్పు తెస్తుంది. (డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసి సిట్ వాళ్లు పట్టుకుని ఇంటరాగేట్ చేసారా...అదేనా ఆ సంఘటన అంటారా... అలాంటిదేమీ లేదు..అది వేరేది) . ఆ సంఘటనతో తానెవరో తెలుసుకోవాలన్న కోరిక పుడుతుంది. తన కోట్ల రూపాయల ఆస్దిని, సుఖాల్ని.. సంపదను వదిలేసి తన గురించి తాను తెలుసుకోవడానికి ఓ ప్రయాణం మొదలెడతాడు.
సరిగ్గా అదే సమయంలో డైరక్టర్ అక్కడికి పంపించినట్లుగా ... అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ (గోపీచంద్) తారసపడతాడు. నంద కిషోర్ నిత్య దరిద్రుడు. కష్టాలు ఎక్కువై ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు. ఇద్దరూ ఒకే పోలికలకలతో ఉండటంతో కాస్సేపు షాక్ అయ్యి...ఆ తర్వాత సిట్టింగ్ వేసి..ఒకరి కథలు,కష్టాలు మరొకరికి చెప్పుకుంటారు. (అంతేతప్ప ఇద్దరం ఒకే పోలీకలతో ఎలా పుట్టాము అని తీగని లాగే ప్రయత్నం చేయరు)
ఆ సిట్టింగ్ లో ...ఎన్నో సినిమాల్లో చూసిన అనుభవమో మరేమో కానీ...తమ ప్లేసులు మార్చుకోవాలని ఆలోచన వస్తుంది. దాన్ని అమలు పరుస్తారు. నందు స్థానంలో గౌతమ్ ఓ బస్తీకి వెళ్తాడు. ఆ బస్తీలో సామాన్యమైన జీవితం గడపడం ప్రారంభిస్తాడు.
మరో ప్రక్క నంద...మిలియనీర్ గౌతమ్ గా అవతారమెత్తుతాడు ఈ ప్రయాణంలో ఈ ఇద్దరికి ఎదురైన అనుభవాలేంటి? అసలు గౌతమ్ ని ఆలోచనలో పడేసి, జీవితాన్ని మార్చేలే చేసిన ఆ సంఘటన ఏమిటి...పేద ఇంట్లో గౌతమ్ ఉండగలిగాడా..డ్రగ్స్ అలవాటు కూడా ఉన్న గౌతమ్ ఆ పేదల బస్తీలో ఎడ్జెస్ట్ కాగలిగాడా... ఇంతకీ ఈ కథలో విలన్ ఎవరు..హీరోయిన్స్ కేథరిన్, హన్సిక ఏం చేస్తూంటారు వంటి విషయాలు తెలియాలంటే ‘గౌతమ్ నంద’ సినిమా చూడాల్సిందే.
కష్టాల్లోనే ఆనందం..కరెన్సీ కట్టల్లోనే విషాదం
డబ్బులో ఏమీ లేదని, పట్టెడన్నం కూడా దొరకని పేదరికంలోనే పట్టలేనంత ఆనందం దొరుకుతుందని, కంటిన్యూగా వచ్చే కష్టాలలోనే జీవితానుభూతులు కలిసిపోయి ఉంటాయని,కన్నీళ్లులోనే ఆత్మీయత అనుబంధాలు బయిటకు వెల్లడవుతాయని వెండితెరసాక్షిగా నూరిపోయిటం మొదటినుంచీ మన సినిమావాళ్ల ఆనవాయితీ. మిడిల్ క్లాస్ జనం కూడా డబ్బంటే అందని ద్రాక్ష పుల్లనిలా భావిస్తూ సినిమావాళ్లు చెప్పేది నిజమే ...మా ఉండీలేని కుటుంబాల్లో ఉన్నంత ఆనందం,అనుబంధాలు ....డబ్బున్న ప్యామిలీలలో ఏముంటుంది అని తృప్తిపడి హిట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యన ఎందుకనో ఆ ట్రెండ్ ప్రక్కకు వెళ్లింది. ఆ విషయం పసిగట్టిన సంపత్ నంది ...హిట్ కోసం ఆ స్కీమ్ ని బయిటకు తీసి, దానికి రాజు పేద ,ఇద్దరు మిత్రుల నాటి కథ,కథనం తీసుకుని 'గౌతమ్నంద' అంటూ మన ముందుకు వచ్చాడు.
ఇలా చేసావేంటి సంపత్ ?
సర్లే హిట్ టైటిల్స్, హిట్ ఫార్ములాలు రిపీట్ చేయటం తప్పూ కాదు..కొత్తా కాదు. కానీ ...యాజటీజ్ అదే పాత సినిమాల స్క్రీన్ ప్లేని దింపేయటమే బాగోలేదు. క్లైమాక్స్ ముందు ఓ చిన్న ట్విస్ట్ తప్ప కొత్తదనమనదే లేదు. చేసిన గోపీచంద్ కు ఇది కొత్త కథేమో కానీ..చూసిన జనాలకు మాత్రం ఇది బాగా నలిగిపోయిన వ్యవహారమే. దాంతో పాయింటాఫ్ ఇంట్రస్ట్ కొరవడింది.
అదే అక్కినేని ఇద్దరు మిత్రులు సేమ్ ..యాజటీజ్ ఇదే ప్లాట్ అయినా చాలా ఫెరఫెక్ట్ స్క్రిప్టుతో నడుస్తూంటుంది. అందుకనే ఈ రోజుకు కూడా ఆ సినిమాని గురించి మాట్లాడుకోగలగుతున్నాం.
క్లైమాక్స్ కు కానీ కథ ముడి విప్పక..
ఈ సినిమా స్క్రీన్ ప్లేలో విలన్ పాత్రలో డెప్త్ లేకపోవటమే దెబ్బ కొట్టింది. సెకండాఫ్ నుంచి హీరో తనపై ఎవరో ఎటాక్ లు చేస్తున్నారు..చేస్తున్నారు అనుకోవటమే సరిపోతుంది. కానీ ఆ విలన్ ఎవరో తెలుసుకోడు. ప్రేక్షకులకు తెలియదు. క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ ఎవరో హీరోకు తెలుస్తుంది. అతన్ని ఎదుర్కొనే సరికి సినిమా అయ్యిపోతుంది. అదేదో విలన్ పాత్ర ఇంకాస్త ముందు వచ్చుంటే ఖచ్చితంగా మజా వచ్చుండేది. కానీ దాన్నిక్లైమాక్స్ ట్విస్ట్ గా వాడుకున్నాడు సంపత్.
కావాల్సింది వదిలేసి...
పాత కథో,కొత్త కథో ఏదో ఒకటి చెప్తున్నా అందులో నవ్వించే కామెడీ కానీ, బలమైన కామెడీ ట్రాక్ కానీ పెడితే కొంతలో కొంత సేవ్ అయ్యేది. తూతూ మంత్రంలాగ కామెడీ కోసం వెన్నెల కిషోర్ ని, బిత్తిరి సత్తిని తెచ్చి తనకు తోచిన డైలాగులు చెప్పించారు. రొమాన్స్,పాటల కోసం హన్సికను, కేథరిన్ ని గెస్ట్ ఆర్టిస్ట్ లు మాదిరి అవసరమైనప్పుడు తీసుకు వచ్చాడు. ఇక విలన్ ..ముఖేష్ రుషి థ్రెడ్ అయితే...దారుణం..మరీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగ అనిపిస్తుంది. ఫైట్స్ కావాల్సి న వచ్చినప్పుడు రౌడీలు, అందుకు కారణం ప్రత్యక్ష్యమవుతాయి.
సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు అయితే నిజంగా కన్నీళ్లు వస్తాయి. సినిమా చూస్తున్నామా..ఏదన్నా టీవి సీరియల్ చూస్తున్నామా అనిపిస్తుంది. అంత ఓవర్ డోస్ లో ఆ సీన్స్ ని డిజైన్ చేసారు.
మెచ్చుకోవాల్సిన అంశాలు
సినిమాలో దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టింది...రిచ్ విజువల్స్ మీదే. మిలియనీర్ అయిన గౌతమ్ లైఫ్ స్టైయిల్ ని కళ్ళకు కట్టినట్లు చాలా రిచ్ గా చూపించాడు. అలాగే గోపీచంద్ ని ఇంతకు ముందు సినిమాల్లో చూపించినట్లు కాకుండా..స్టైలిష్ గా చూపించారు. గోపిచంద్ సైతం..రెండు పాత్రల్లో వేరియేషన్స్ ని ప్రతిభావంతంగా పోషించగలిగారు.
టెక్నికల్ గా
సినిమాకు మేజర్ హైలెట్ సౌందర్ రాజన్ కెమెరా వర్క్. ముందే చెప్పుకున్నట్లు ... ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనబడేలా చూపటంలో సక్సెస్ అయ్యారు. నిర్మాణవిలువలకు వంక పెట్టక్కర్లేని విధంగా ఉన్నాయి. థమన్ సంగీతం గొప్పగా కిక్ ఇవ్వలేదు. ఓ రెండు పాటల బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. డైలాగులు అద్బుతం కాదు కానీ ఓకే. అయితే సంపత్ గత చిత్రాల్ల తరహాలో లేవు.
ఏమి బాగుంది: కేథరిన్ గ్లామర్, సినిమాటోగ్రఫీ, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
ఏం బాగోలేదు: పరమ రొటీన్ కథ, కథనం
ఎప్పుడు విసుగెత్తింది : సెంటిమెంట్ సీన్స్ లో
చూడచ్చా ?: గోపీచంద్ అబిమానులు చూడచ్చు. మిగతావారు ఏ ఆప్షన్ లేకపోతే వెళ్లచ్చు
ఫైనల్ థాట్
సక్సెస్ లేని హీరోలకు ఫర్వాలేదనిపించే సినిమాలు పెద్దగా వర్కవుట్ అవటంలేదు. గోపిచంద్ కెరీర్ ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఫర్వాలేదనిపిస్తే కుదరదు. అదిరిపోయిందనిపించాలి. కానీ ఈ సినిమా ఆ స్దాయిలో లేదు.