Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Shamantakamani Movie Review

July 14, 2017
Bhavya Creations
Aadi, Nara Rohith, Sundeep Kishan, Sudheer Babu, Dr. Rajendra Prasad, Chandini Chowdary, Jenny Honey, Ananya Soni, Indraja, Kasturi, Suman, Tanikella Bharani, Hema, Surekha Vani, 'Satyam' Rajesh, Benerjee, Adurs Raghu,
Sriram Aditya
Sameer Reddy
Praveen Pudi
Vivek Annamalai
Mani Sharma
V Anand Prasad
Sriram Aditya

మెరపులు,మైమరుపులు లేని 'శమంతకమణి' (రివ్యూ)

హోం మినిస్టర్ కొడుకు ... విక్కీరాయ్‌ ఓ ప్లే బోయ్...తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అతను చెయ్యని నేరం లేదు. కాని అతనికి శిక్ష పడదు. కారణం అతని తండ్రి అధికారమే‌. ఓ రోజు బార్‌లో అందరిముందరా ఒక అమ్మాయిని కాల్చి చంపుతాడు, అయినా అతను నిర్ధోషి అని కోర్టు తీర్పునిస్తుంది. దానిని సెలబ్రేట్‌ చేయ్యడం కోసం అతనొక పార్టీ యిస్తే, ఆ పార్టీలోనే అతన్ని ఎవరో హత్య చేస్తారు. ఆ మర్డర్ కేసులో అనుమానితులు ఆరుగురు - దయ్యం పట్టిన ఒక ఐపిఎస్‌ అధికారి, ఒక సెక్సీ స్టార్‌, ఒక అండమాన్స్‌ ఆదివాసి, ఒక సెల్‌ఫోన్ల దొంగ, సీఎం అవాలనుకుంటున్న ఒక రాజకీయ నాయకుడు, ఒక అమెరికన్‌ బఫూన్‌ - అందరి దగ్గరా రివాల్వర్లు దొరుకుతాయి, నేరం చేసేందుకు అందరికీ తగిన కారణాలున్నాయి. ఈ అనుమానితుల్లో అసలు హంతకులెవరు?

ఇదేంటి...'శమంతకమణి' అంటూ సినిమా గురించి చెప్పకుండా ఏదోదో చెప్తున్నారు అనుకుంటున్నారా...ఇప్పుడు మీరు చదివిందంతా 'అరుగురు అనుమానితులు' అని స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా కు కథ అందించిన వికాస్ స్వరూప్ మరో నవల (సిక్స్ సస్పెక్ట్స్) ప్లాట్ ఇది. ఈ నవలకు ఈ రోజు రిలీజైన 'శమంతకమణి' సినిమా కథకు సంభదం ఏంటి అంటారా...మీకు 'శమంతకమణి' సినిమా కథ ఏంటో చెప్తా..దాంతో అసలు లింకేంటో మీకే తెలుస్తుంది. అలాగే సినిమా ఎలా ఉంది..సినిమాని ఈ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చో లేదో కూడా మాట్లాడుకుందాం పదండి.

కథేంటి

కోటీశ్వరుడైన కృష్ణ(సుధీర్‌బాబు) తన ఫ్రెండ్స్ కి ఓ పెద్ద హోటల్ లో భారీ పార్టీ ఇస్తాడు. తాగటం,తినటం, డాన్స్ లు చేయటం పూర్తయ్యి..ఇక బయిలుదేరదాం అనుకునేసరికి అతను వేసుకొచ్చిన ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే కారు కనపడదు. దాని పేరే ‘శమంతకమణి’. దాంతో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో పోలీస్ లను ఆశ్రయిస్తాడు. దాంతో ఆ కారును ఎవరు కొట్టేసారో కనుక్కోవడానికి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ (నారారోహిత్‌) ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆ పార్టీ కిసంభందించిన సిసి ఫుటేజ్ మొత్తం తెప్పించి చూస్తాడు. అలా చూసినప్పుడు అతనికి అనుమానం వచ్చిన వారిని స్టేషన్ కు పిలిపించి ఎంక్పైరీ మొదలెడతాడు.

అలా స్టేషన్ కి వచ్చిన వారిలో ముగ్గురు అనుమానితులు తేలుతారు. వారే ఉమామహేశ్వరరావు(రాజేంద్రప్రసాద్‌), శివ(సందీప్‌ కిషన్‌), కార్తీక్‌(ఆది). ఏదో ఒకటి చేసి జీవితంలో సెటిల్‌ అయిపోవాలనుకునే స్వభావం వీరిది. అంతేకాదు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ కూడా ఇదే టైప్ మనిషి. మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ అసలు ట్విస్ట్. రంజిత్ కుమార్ అనుమానితులని ఎలా విచారించి ఆ మిస్టరీ ని చేధిస్తాడు..ఆ క్రమంలో ఏమేం మలుపులు వస్తాయి..క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి.. ఇవన్నీ తెలుసుకోవాలంటే శమంతకమణి చూడాల్సిందే.

ఇన్విస్టిగేషన్ :)

ఇప్పుటికే మీకు అర్దమై ఉంటుంది..పైన నేను చెప్పిన సిక్స్ సస్పెక్ట్స్(ఆరుగురు అనుమానితులు) ప్లాట్ కు ఈ శమంతకమణికి ఉన్నఅవినా'భావ' సంభందం. అక్కడ కథలో ఓ పార్టీలో మినిస్టర్ కొడుకు మర్డరైతే..అతని మర్డర్ కు ఆ పార్టీకి వచ్చిన ఆరుగురుని అనుమానితులుగా నిర్దారిస్తారు. వాళ్ల ఫ్లాష్ బ్యాక్ లు చెప్పుకుంటూ పోతాడు. ఈ క్రమంలో అందరిమీదా అనుమానం వస్తుంది. చివరకు మర్డర్ చేసిందెవరో ఓ చిన్న ట్విస్ట్ తో ముడి విడుతుంది. శమంతకమణి కథకూడా అంతే...పార్టీలో కారు మిస్సైతే...ఆ పార్టీకి వచ్చిన కొందరిని అనుమానితులుగా నిర్దారిస్తారు. వాళ్ల ప్లాష్ బ్యాక్ ల చెప్పుకుంటూ పోతారు. చివరకు ఎవరు ఆ కారు దొంగతనం చేసారో చిన్న ట్విస్ట్ తో ముడి విప్పుతారు. అలాగని ఈ సినిమా ..ఆ నవలకు కాపీ అనటం లేదు.. కథ,కథనం అనుసరించారేమో అనిపించింది. (అంటే కథ కాస్త నావల్టిగా ఉండాలి కదా..అందుకే నవల రిఫెరెన్స్ తీసుకుని ఉండవచ్చని సమీక్షకుని అభిప్రాయం)

పోలీస్ స్టేషన్ రామన్న

ఊరిలో ఓ పెద్ద చెట్టుక్రింద కూర్చునే మర్యాదరామన్న తన దగ్గరకు వచ్చిన తగువులకి సంభదించిన వ్యక్తుల వాదనలు విని..తన తెలివితో అసలు నేరం ఎవరు చేసారో కనిపెట్టి శిక్షించే కథలు మనం చిన్నప్పుడు ఎన్నో చదువుకుని ఉంటాం. ఈ సినిమాకూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే...

ఈ కథ ని నారా రోహిత్ పోషించిన రంజిత్ అనే పోలీస్ పాత్ర లీడ్ చేస్తూంటుంది. నలుగురు హీరోలు ఉన్నా ...ఓ రకంగా ఆ పాత్రే లీడ్ క్యారక్టర్ అని చెప్పాలి. ఆ పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే ఏదో గట్టిగానే పీకుతాడనిపిస్తుంది...కానీ చూస్తే..కేవలం పోలీస్ స్టేషన్ లో ఓ కుర్చీలో కూర్చుని జరిగిన క్రైమ్ కు సంభందించిన అనుమానితులు ను తన దగ్గరకు రప్పించుకుని వారి ప్లాష్ బ్యాక్ లను ఓపిగ్గా విని ఆలోచించి ఆ కేసుని పరిష్కరిస్తాడు. అంతే తప్ప తన పోలీస్ స్టేషన్ దాటి బయిట ఎక్కడా యాక్షన్ లోకి దిగి పరిష్కరించాలనుకోడు.

సాధారణంగా....క్రైమ్...ఇన్విస్టిగేషన్ సినిమా కథల్లో పోలీస్ అధికారి యాక్షన్ లోకి దిగి ,కేసుని సీరియస్ గా ఇన్విస్టిగేట్ చేసుకుంటూ వెళ్తూంటాడు. విలన్స్ ఆ ఇన్విస్టిగేషన్ కు అడ్డు పుల్లలు వేస్తూంటారు. ఆ క్రమంలో ఆ అధికారికి ఆ కేసుకు సంభందించిన ఎన్నో విషయాలు రివీల్ అవుతూ, ఎన్నో ఊహించని ట్విస్ట్ లు వస్తూంటాయి. దాంతో వాటిని తిప్పి కొట్టడానికి ఆ పోలీస్ అధికారి తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు చూస్తున్న ప్రేక్షకుడుకి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఆ ఇంట్రస్టింగ్ ఫాక్టరే ఇక్కడ కరువైంది. నారా రోహిత్ పాత్ర సినిమా ప్రారంభం నుంచీ కుర్చిలో కూల్ గా కూర్చుని ప్లాష్ బ్యాక్ లు వింటూ కేసు పరిష్కరించేస్తే మనకు థ్రిల్లింగ్ ఏముంటుంది.

పోనీ హిచ్ కాక్ సినిమా రియర్ విండో (1954) లో లాగ ప్రధాన పాత్ర కుర్చీలో కూర్చున్నా ...ఆ పాత్ర పాయింటాఫ్ వ్యూలో జరిగే సంఘనటలు ఆశ్చర్యకరంగా ఉంటూ కథని కదిలిస్తూ ...ఇంట్రస్ట్ కలగచేస్తాయి. ఇక్కడ అలాంటి అంశమూ లేదూ...నారా రోహిత్ వినే మిగతా పాత్రల ప్లాష్ బ్యాక్ లు కూడా అంత ఇంట్రస్టింగ్ గా ట్విస్టీగా ఉండవు.

సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ ల తోటే గడిచిపోవటమే కాకుండా...అన్ని కథల్లోనూ లవ్ థ్రెడ్ నే వారి వారి సమస్యలకు రీజన్ గా పెట్టుకుంటూ వచ్చారు. దాంతో రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చింది.

బాబుల్లో ఏ బాబు బాగా చేసారంటే...

ఈ సినిమాలో అందరూ బాగా చేసారనే చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ బాబు ఇంకా బాగా చేసారు. ఎందుకంటే ఆ పాత్రకు కాస్తంత తల్లి సెంటిమెంట్ ,ఎమోషన్ కలిపారు కాబట్టి.

హీరోయిన్ ఇల్లే

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ అంటే ఎవరూ చెప్పలేరు. అంత కన్ఫూజన్ గా ఉంటుంది. ఉన్నారంటే ఉన్నారు..లేరు అంటే లేరు అన్నట్లుగా ఉంది హీరోయిన్ పరిస్దితి. నలుగురు హీరోలు ఉండటం వల్లనేమో ..మధ్యలో హీరోయిన్ కు ప్లేస్ దొరకలేదు.

డీజేని గుర్తు చేయటం వల్లనేమో

రీసెంట్ గా వచ్చిన అల్లు అర్జున్ డీజే ని చూసిన వాళ్లకు అందులో సుబ్బరాజు..తల్లి సెంటిమెంట్ పాత్ర కామెడీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఎప్పుడో చనిపోయిన తల్లి పాత్రను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడూ. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్రని కూడా అలాగే డిజైన్ చేయటం కాకతాళీయమే కావచ్చు. కాకపోతే డీజే లో ఆ పాత్ర కామెడీ పండిస్తే..ఇక్కడ సుధీర్ బాబు పాత్ర సెంటిమెంట్ పండించింది. అయితే డీజే లో ఆ పాత్రని కామెడీగా ఆల్రెడీ చూసి ఉండటం చేత...సుధీర్ బాబు తల్లి సెంటిమెంట్ కూడా కాస్త వెటకారంగా అనిపించింది.

టెక్నికల్ గా ఎవరు హైలెట్ అంటే

ఈ సినిమా సాంకేతిక విషయాలకు వస్తే మణిశర్మ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. అలాగే కెమెరా వర్క్ అదిరింది. డైలాగులు సైతం న్యాచురల్ గా ఉండి బాగున్నాయి.

ఫైనల్ గా ఏమంటానంటే

ట్రైలర్ ,టీజర్ చూసి ఎక్సపెక్టేషన్స్ పెంచుకుని వెళ్తే కబాలి సినిమాలా మోసపోయాం అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్స్, ట్రైలర్స్ లో ఉన్న ఎక్సైట్ మెంట్ సినిమాలో లేదు. ఎంటర్ట్నైన్మమెంట్ ఆ స్దాయిలో లేదు. తీసిపారేసే సినిమా కాదు..అలాగే తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అసలు కాదు.

ADVERTISEMENT
ADVERTISEMENT