భ్రమరాంభనే పెళ్లాడతా!! ('రారండోయ్ వేడుక చూద్దాం' రివ్యూ)
పెళ్లంటే.... పందిళ్లు, సందళ్లు, బంధువులు, విందులు, వినోదాలు, పట్టుచీరలు, పెళ్లి తగువులు, తాళాలు, తలంబ్రాలు,జీవితంలో ఒక్కసారే కదా చేసుకునేది అంటూ ఎక్కడలేని విపరీతమైన ఖర్చులు.! అందుకే పెళ్లి అనగానే మిస్ కాకుండా అందరం మాగ్జిమం హాజరవుతూంటాం. ఆ తర్వాత ఆ మెమెరీస్ ని గుర్తు చేసుకోవటానికి... ఇళ్లల్లో ఆ పెళ్లి వీడియోలని పదే పదే చూస్తూంటాం. ఈ విషయాన్నిపసిగట్టి... అదే పెళ్లి హంగామాని యాజటీజ్ బ్లూ ప్రింట్ తీసి, దానికి కొద్దిగా లవ్ యాంగిల్ కలిపి తెరపై చూపెడితే తమ ఇంట్లో పెళ్లి జరిగినట్లుగానో, లేక ఓ పెద్దింటి పెళ్లికి వెళ్లినట్లుగానో, ఫీలై...ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయటానికి జనం ఎగబడతారని సూత్రం కనుక్కున్నాడు ఓ బాలీవుడ్ పెద్దాయన. మైనే ప్యార్ కియా, "హమ్ ఆప్కే హై కౌన్" అనే సినిమాతో ఆ విషయాన్ని ప్రూవ్ చేసాడు. ఆయనే సూరజ్ బర్జాత్యా.
సూరజ్ బర్జాత్యా సెట్ చేసిన సక్సెస్ ఫుల్ ట్రెండ్ ని మన సినిమావాళ్లు అమాంతం గుర్తించి, అదే ఫార్ములాని ఎత్తేసి... నిన్నే పెళ్లాడతా, మురారి(ఇంకా గుర్తురాని కొన్ని సినిమాలు) అంటూ కొనసాగించారు. ఆ సినిమాలు మంచి హిట్టైనా...ఆ తర్వాత పెద్దగా ఆ స్కీమ్ ని కంటిన్యూ చేసి సినిమాలు తీసినవాళ్లు లేరు. మళ్లీ ఇంతకాలానికి అదే ఫార్ములా ని రిపీట్ చేసాం...రారండోయ్ అని పిలిచాడు నాగార్జున. ఎందుకైనా మంచిదని ..తమ సినిమా నిన్నే పెళ్లాడతా లాగ ఉంటుందని పదే పదే పబ్లిసిటీ కూడా చేసారు. ఇంతకీ ఈ సినిమా నిన్నే పెళ్లాడతా స్దాయిలో ఉందా... అసలు కథేంటి...సమ్మర్ హాలీడేస్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోగలుగుతుందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవండి.
కథేంటి...
అనగనగా ఓ పల్లెటూరు..అక్కడ అంతరించిపోయిన ఉమ్మడి కుటుంబాలకు గుర్తుగూ మిగిలిన ఓ పెద్ద కుటుంబం..ఆ కుటుంబంలో ఒకే ఒకే ఆడపిల్ల..భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) . అందరకీ ఆమె అంటే ముద్దే...గారమే. గారాలతోపాటు.. చిన్నప్పటి నుంచీ ఆమె నాయనమ్మ...నీ కోసం ఓ రాకుమారుడు వెతుక్కుంటూ వస్తాడు అని ఆమె మనస్సుని ఊహలతో నింపుతుంది. అలా పెరిగి పెద్దైన ఆమె ఊహల్లో రాకుమారుడు (చిన్నప్పుడు చెప్తే నమ్ముతారు..పెధ్దయ్యాక కూడా తింగరగా అలాంటి ఊహలను పట్టుకుని వేల్లాడతరా అని అడగొద్దు) కోసం ఎదురుచూస్తున్న సమయంలో..ఆమెకు ఓ పెళ్లిలో శివ (నాగచైతన్య) పరిచయమవుతాడు.(అబ్బే..అప్పుడే కంక్లూజన్ కు రావద్దు..అతను రాకుమారుడు కాదు) శివ...తొలి చూపులోనే...భ్రమరాంబతో ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనక పడతాడు. కానీ ఈలోగా వాళ్లు వెళ్లిన పెళ్లైపోతుంది. వీళ్లు దూరమైపోతారు.
అయితే విధి ..(దర్శకుడుకి)వీళ్లను కలపాలని నిర్ణయించుకున్నట్లుంది. భ్రమరాంబ చదువుకోసం (శివ ఉంటున్న ఊరు) వైజాగ్ వస్తుంది. అక్కడ ఆమెకు కాలేజీలో ఓ సమస్య వస్తుంది. దాంతో ఆమె శివని పిలుస్తుంది. శివ ఎగిరిగంతేసి వచ్చి ఆమెకు సాయిం చేసి, ఆ సమస్యను సాల్వ్ చేస్తాడు. అయితే అంత సాయిం చేసాం,ఫైట్ చేసాం..డ్రీమ్ లో సాంగ్ వేసుకున్నాం కదా అని ఆమె కూడా ప్రేమలో ఉందేమో అని మనవాడు భ్రమపడతాడు.
కాని భ్రమరాంబ తన దగ్గర అలాంటి పప్పులేమీ ఉడకవు. ఆమె...మన శివను ఓ స్నేహితుడులా చూస్తుంది. అతనితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. అన్ని రకాలుగా...సాయాలు పొందుతూంటుది. అయితే ప్రేమ అనే విషయం మాత్రం తన దగ్గర ఎత్తవద్దని చెప్తుంది. అంతేకాదు తన మనస్సు...తన ఊహల్లో ఉన్న రాకుమారుడు కే అంకితమంటుంది. అక్కడితో ఆగతుందా.. ఓ సుముహార్తాన ...మన హీరోని..నువ్వు నా ఊహల్లో ఉన్న రాకుమారుడివి పోల్చదగినవాడివి కాదు...ఓ ఆర్డనరీ ఫెలో వి అని తేల్చి చెప్పేస్తుంది. దాంతో మనోడు హర్ట్ అయ్యాడు.
ఎంత ప్రేమించినా అంత మాట అన్నాక ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఇగో దెబ్బతింటుంది కదా. అదే మన హీరోకు జరిగింది. దాంతో భ్రమరాంబకు బై చెప్పేసాడు. ఆమె కూడా ఫోవోయ్..బోడి..నేను నా రాజకుమారుడుని పెళ్లాడతా అని వెళ్లిపోయింది. మరి మళ్లీ వీళ్లు ఇద్దరూ ఎలా కలిసారు. మరో ప్రక్క శివ తండ్రికి(జగపతిబాబు) భ్రమరాంబ తండ్రికి(సంపత్)కి కూడా విరోధం ఉంటుంది. ఆ విరోధానికి కారణం ఏమిటి...ఇంతకీ శివ భ్రమరాంబ కలిశారా..? భ్రమరాంబ కోసం శివ ఏం చేశాడు అన్నది అసలు కథ.
విశ్లేషణ...
నావెల్టీ ఏ మాత్రం లేని ఈ రొటీన్ కథ కల ఈ సినిమాని సీన్స్ మీదే ఎక్కువ ఆధారపడి డైరక్టర్ ట్రీట్ మెంట్ రాసుకున్నాడు. అలాగని స్క్రీన్ ప్లే మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమా ఫస్టాఫ్ మొత్తం మురారి సినిమా చూస్తున్నట్లుగా...ఎక్కడ చూసినా పూలదండలు, ఇంటినిండా మందలుమందులుగా జనం.... వాళ్లమధ్య చిత్రాతిచిత్రమైన ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటుంది. అఫ్ కోర్స్ ఫస్టాఫ్ లో కనపడ్డ ఆ క్యారక్టర్స్ లో చాలా భాగం డైరక్టర్ కే బోర్ కొట్టారో మరేమో కాని ...మళ్లీ సెకండాఫ్ లో కనపడవు...అలా కంటికి ఇంపుగా సీన్స్ పేర్చుకున్నాక, ఓ లవ్ స్టోరీ మొదలెట్టారు. ఆ లవ్ స్టోరీ..హీరోయిన్ సెంట్రిక్ గా ...ఆమె క్యారక్టర్ ని బేస్ చేసుకుని సాగటం..ఉన్నంతలో కాస్త ఊరడింపు. అలా..హీరో,హీరోయిన్స్ మధ్యా '100% లవ్' నడిచాక ఓ చిన్న ట్విస్ట్...ఓ ఫ్లాష్ బ్యాక్, చిక్కు ముడి విడతీయటం, మెయిన్ క్యారక్టర్స్ ని కలపటం చేసారు.
అక్కడే చిక్కంతా..
ఈ సినిమాలో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ...హీరోయిన్ క్యారక్టర్ బేస్ చేసుకుని రాసుకున్నప్పుడు అక్కడే కథ మొదలెట్టి చెప్తే సరిపోయేది. పూర్తి యూత్ ఫుల్ లుక్ వచ్చేది. అలా కాకుండా సినిమాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుక్ తెద్దామని...ఈ కథకి...అతకని మురారి సెటప్ సీన్స్ కలపటంతోనే వచ్చింది చిక్కంతా..అలాగే..హీరో,హీరోయిన్ తండ్రుల మధ్య పగ, ప్లాష్ బ్యాక్ సీన్స్ రొటీన్ వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసేసాయి. అవి తీసేస్తే కాస్త లెంగ్త్ కలిసిరావటమే కాకుండా...యూత్ ని టార్గెట్ చేసిన ఓ ఫ్రెష్ సినిమా చూసినట్లు అనిపించేది. గౌతమ్ మీనన్ స్దాయి కాకపోయినా అలాంటి సినిమా చూసినట్లు అనిపించేది. దర్శకుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు యూత్ ని ,ఇటు ఫ్యామిలీస్ ని ధియోటర్ కు లాగేయాలనుకున్నాడు. అక్కడే చిక్కంతా వచ్చింది. కథ చిక్కులు పడిపోయింది.
ఏం బాగుందంటే...
సినిమాలో హీరోయిన్ ని హీరో నాగచైతన్య... ఫ్రీ క్లైమాక్స్ లో నిలదీసి,తిట్టి వెళ్లిపోయే సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. నాగచైతన్యలో పూర్తి స్దాయి నటుడు ఆ సీన్ లో ఆవిష్కారమయ్యాడు ఇన్నాళ్లకు. చైతూ నుంచి ఆ స్దాయి నటన ఎక్సపెక్ట్ చేయం. ఆ సీనే పడిపోయిన సినిమా గ్రాఫ్ ని ఒక్కసారిగా లేచి నిలబెట్టింది.
మెయిన్ లీడ్ ఎలా చేసారంటే
అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ ని బేసే చేసుకునే ఈ సినిమా కథ సాగుతుంది. ఆ పాత్రను రకుల్ ప్రీతి సింగ్ పోషించింది. అయితే ఆమెలో పల్లెటూరి అమాయికత్వం, తింగరితనం పెద్దగా కనపడలేదు. డైలాగుల్లో అవి కనపుడున్నా...ఫేస్ లో ఆమె అర్బన్ లుక్ కొట్టిచ్చినట్లు కనపడుతోంది. ఇక చైతూ విషయానికి వస్తే....పైన చెప్పుకున్నట్లు...హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా ఉండి శభాష్ అనిపించుకున్నాయి.
వాళ్లంతా ఏరి
సినిమా ప్రారంభంలో వచ్చే పెళ్లి హడావిడిని చూపెట్టడానికి వాడుకున్న నటులు పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి అంతా ఏమైపోయారో తెలియదు. చివర్లో మళ్లీ వాళ్లని తీసుకుని వస్తే బాగుండేది.
పాటలు,మాటలు, దర్శకత్వం
సినిమాలో పాటలు వినటానికి బాగానే ఉన్నా, చూడటానికి అంత గొప్పగా లేవు. మాటలు చాలా సింపుల్ గా క్యారక్టర్ ని ఎలివేట్ చేసేలా రాసుకున్నారు. ఎక్కడా పంచ్ లకు,ప్రాసలకు పోకపోవటంతో బాగున్నాయి. దర్శకుడుగా కళ్యాణ్ కృష్ణ...ఓ కలర్ ఫుల్ ఎంటర్టైనర్ ని తీయాలని రిఫెరెన్స్ లుగా పెట్టుకున్న సినిమాలను అనుకరించకుండా..స్వంతంగా ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా తనదైన ముద్ర వేయగలిగే వారు.
టెక్నికల్ గా ..
సినిమాలో కెమెరా పనితనం పెళ్లి సీన్స్ లో కలర్ ఫుల్ గా, మిగతా చోట్ల విజువల్స్ ఓకే అన్నట్లుగా సాగాయి. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. ఫస్టాఫ్ పూర్తయ్యే సరికే సినిమా మొత్తం చూసిన ఫీల్ వచ్చింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు గురించి ఇవాళ కొత్తగా మాట్లాడుకునేది ఏమీలేదు. వంక పెట్టేదేమీ లేదు.
ఫైనల్ గా...
నిన్నే పెళ్లాడతా స్దాయి కాదు కానీ...కాలక్షేఫానికి ఫ్యామిలీలతో వెళ్తే నిరాశపరచదు. సమ్మర్ లో ప్రస్తుతానికి బాహుబలి మినహాయిస్తే... పోటీ సినిమాలు ఏమీ లేవు కాబట్టి కలెక్షన్స్ పరంగా కలిసివచ్చే అవకాసం ఉంది.