Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music



Tribute to Lady Superstar Sridevi (1963 -2018)

 వెలుగుల సిరి దేవి... వెళ్లిపోయింది!

కాల ప్రవాహం... అందరూ కొట్టుకుపోతునే ఉంటాం.
కానీ, మన మధ్య తిరిగే వ్యక్తి ఒకరు హఠాత్తుగా మన నుండి వెళ్లిపోయారు అంటే...
ఒక్క క్షణం అందరం ఆగుతాం చూశారూ?
ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచిస్తాం చూశారూ??
వాళ్లు... మన జీవితాల్లో ఇంకిపోయారని అర్థం.
అలా మనలో ఇంకిపోయిన ఒక జ్ఞాపకం... శ్రీదేవి.
మన జీవితాలతో అల్లుకుపోయిన ఒక అనుబంధం... శ్రీదేవి.
మనల్ని నవ్వించిన శ్రీదేవి... మురిపించిన శ్రీదేవి.
మన కష్టాల్ని కాసేపు మరిపించిన శ్రీదేవి... కమ్మని కలలిచ్చిన శ్రీదేవి.
చీకటిలో వెలుగు... సినిమా అయితే, ఆ వెలుగుని మించి వెలిగిన తార... శ్రీదేవి.

ఆమె ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లపోవటం, నివాళులు ఘటించాల్సి రావటం  నిజంగా చాలా బాధాకరం. కెరీర్ పరంగా ఆమె చెయ్యదగిన పాత్రలు అన్ని చేసేసారు. ముఖ్యంగా తర్వాత తరాల వారు ఫలానా ఎక్స్పప్రెషన్ ఎలా ఉంటుంది... ఫలానా సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అని రిఫెరెన్స్ చూసుకోవటం కోసం తన సినిమాల్లో నటనే డిక్షనరిగా అందించారు.ఆమెను  ఫాలో అయితే చాలు నటనలో అద్బుతాలు చేసేయచ్చు అని  చాలా మందిలో నమ్మకం కలిగించించారు.

ముఖ్యంగా మన తెలుగు వాళ్లంటే ప్రత్యేకమైన అభిమానం అనుకుంటా....పదహాళ్లవయస్సు నుంచి కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా వంటి ఎన్నో ..ఎన్నెన్నో  సూపర్ హిట్ సినిమాలు గిప్ట్ ఇచ్చారు.  200లకు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. తెలుగులో  స్టార్ హీరోలందరితో  నటించారు. తెలుగులో  85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి లెక్క కట్టలేనంతమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఆమె కీర్తి అక్కడితో ఆగలేదు.. ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో  అప్పట్లో ఆమెకు  జురాసిక్ పార్క్ చిత్రంలో కీ రోల్ లో ఆఫర్ చేసే దాకా ప్రయాణం చేసింది. అయితే  బాలీవుడ్ కు దూరం అవుతాను అని భావించిన ఆమె  నో చెప్పేసింది. ఆ తర్వాత ఆ చిత్రం ప్రంపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసినా రిగ్రెట్ ఫీలవలేదు.

ఇక శ్రీదేవి లో మరో కోణం ఏమిటంటే...ముక్కు మీద కోపం, మనస్సు నిండా...ప్రేమ, క్షణా గుణం అని ఆమెతో పరిచయం ప్రతీ ఒక్కరూ  చెప్తారు. కుటుంబ సభ్యుల ఆస్ది  విషయంలో ఆమెకు చెల్లెలు శ్రీలత తో విభేధాలు వచ్చినప్పుడు...  శ్రీదేవిలో ఉన్న క్షమాగుణంతో ఓ ముద్దుతో అవి పరిష్కారం అయ్యాయి. అదీ  ఆమెలో ఉన్న గొప్పతనం...అందమంటే రంగు, రూపం కాదు. బాహ్య అందం అంతకన్నా కాదు. అందం అంటే మనసుతో ముడిపడి ఉంది అని మరోసారి ప్రూవ్ చేసింది.

అలాగే ఓ స్దాయికి వచ్చాక..తను చేసే సినిమాల్లో ఖచ్చితంగా తనకంటూ గుర్తింపు ఉండే పాత్ర ఉంటేనే చేయటానికి ముందుకువచ్చేవారు ఆమె. సరైన పాత్ర లేదని చాలా పెద్ద సినిమాలు వద్దనుకున్నారు.  అంతెందుకు శ్రీదేవి చాలా కాలం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ప్రక్కన చేయటానికి  ఆసక్తి చూపలేదు.  దాని కారణం ఆమె 1987లో ఫిల్మ్ ఫేర్ ఇంటర్వూలో చెప్తూ.... అమితాబ్ వంటి స్టార్ సినిమాలో తనలాంటి హీరోయిన్ చేయటానికి ఏముంటుంది అని డైరక్ట్ గానే  వ్యాఖ్యానించారు. అయితే  తర్వాత ఆమె తన పాత్ర ఫ్రాధాన్యమున్న అమితాబ్ చిత్రాల్లో నటించింది.

శ్రీదేవిలా  లాంగ్ సినీ కెరీర్ ఉన్న  చాలామంది నటీమణులకు ఉండి ఉండొచ్చు. కానీ.. ఆమెకున్న క్రేజ్ మాత్రం ఎవరికీ లేదనేది మాత్రం సత్యం. ఆమె క్రేజ్ కి చిన్న ఉదాహరణ.. సింగపూర్ లోని   ఢిల్లీ రెస్టారెంట్ అన్న పేరుతో  ఉన్న ఒక హోటల్   ... శ్రీదేవి పింగాణి బొమ్మను తయారు చేసి  రిసెప్షన్ లో ఎదురుగా  పెట్టుకుంది. ఈ బొమ్మ కింద శ్రీదేవి గొప్పతనం గురించి వివరిస్తూ కొంత సమాచారాన్ని ఉంచారు. ఆ బొమ్మతోనే ఆ హోటల్ ప్రఖ్యాతి చెందింది.

గత కొంతకాలంగా  శ్రీదేవి తన  పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరాట్‌’ సినిమాను హిందీలో ‘దడాక్‌’ పేరుతో రిమేక్‌ చేస్తున్నారు. కరణ్‌ జోహర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కాకుండానే ఆమె ఇలా పరలోక యాత్ర ప్రయాణం పెట్టుకోవటమే అత్యంత విషాదం.

భారతీయ సినిమా హీరోయిన్ల గురించి  మాట్లాడుకోవాల్సి వస్తే   ఖచ్చితంగా ‘‘శ్రీదేవికి ముందు.. శ్రీదేవికి తర్వాత..’’ అనే స్దాయికి తన అభినయంతో  వచ్చిన శ్రీదేవి  అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌.  కేవలం కళ్లతోనే నటించగలిగే సత్తా ఉన్న ఆమె 1967లో బాలనటిగా ‘కన్దన్‌ కరుణాయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు.

ఇక శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్‌ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు.  నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది.

సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌’గా  ఎంపికైన శ్రీదేవిని ... మరో వందేళ్లు అయినా మర్చిపోవటం కష్టమే.   తెలుగు ప్రేక్షకుల మనసులలో కలకాలం నిలిచిపోయే అందాల నటి, అద్భుత నటి శ్రీదేవి మనకిక లేరంటే నిజంగా దిగ్భ్రాంతే!! తీరని శోకమే!!

 Other Links: Movie Info  
ADVERTISEMENT
ADVERTISEMENT