Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music



Tribute to Darsakaratna Dasari Naryana Rao

దేవుడా నీకు ధన్యవాదాలు !

నేను కొత్త వాడినండీ.. ఓ సినిమా డైరక్ట్ చేసాను...నేను ఆడియో పంక్షన్ చేసి నా సినిమా గురించి కాస్త మాట్లాడాలి. ఎవర్ని పిలవాలి..ఎవరు నా తరుపున నా సినిమా గురించి మాట్లాడే పెద్ద మనిషి..ఎవరు నేను పిలిస్తే కాదనకుండా వస్తారు..నాలాంటి కొత్తవాడిని ఎంకరేజ్ చేసేదెవరు అంటే నూటికి లక్షపాళ్లు గుర్తుకు వచ్చే పేరు దాసరి నారాయణరావుగారు. నువ్వు సినిమా వాడివైతే ఆయనవాడివే. ఆయనకు పరిచయమున్నవాడివే. ప్రత్యేకంగా నిన్ను నువ్వు పరిచయం చేసుకోనక్కర్లేదు. నీ తరుపున వకాల్తా పుచ్చుకుని నీ సినిమాని ఆయన సినిమాగా భావించి ఎన్ని పనులున్నా వాయిదా వేసుకుని వచ్చేస్తారు... నిజమాండీ...

యస్...నువ్వు వెళ్లు...పెద్ద సినిమా నిర్మాతనైనా, దర్శకుడునైనా, హీరోనయినా ఆయన ప్రక్కన పెడతారేమో కానీ చిన్న సినిమాని , కొత్త వాడిని ఎంకరేజ్ చేయటానికి ఆయన ముందుంటారు. ఇది అతిశయోక్తి కాదు. కల్పన అంతకన్నా కాదు..ఓ మిత్రుడు విషయంలో నిజంగా జరిగింది. కనీస పరిచయం కూడా లేకుండా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని పిలిస్తే...చెప్పిన టైమ్ కు ఓ ఐదు నిముషాలు ముందే వచ్చి ఆ సినిమా దర్శకుడు గురించి, కథ గురించి అనర్గళంగా మాట్లాడి, మీడియా దృష్టిలో పడేలా చేయటమే కాదు...సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు వస్తే దగ్గరుండి సెటిల్ చేసిన మహనీయుడు ఆయన. ఇలాంటి సంఘటనలు చాలా మంది సినిమావాళ్లకు అనుభవమే. అందుకే దాసరిగారు అంటే అందరికీ గౌరవం. ఆయన దగ్గర పనిచేయకపోయినా...ఆయన్ను గురువు గారు అని మనస్పూర్తిగా అనేటంత ప్రేమ, గౌరవం, అభిమానం.

మరో చోట షూటింగ్ చిన్న విభేధం..యూనియన్స్ కలగచేసుకున్నాయి. మెల్లిమెల్లిగా పెద్ద సమస్య అయ్యిపోయింది. ఎన్ని దఫాలుగా చర్చలు, రాయబారాలు జరుపుతున్నా సమస్య కొలిక్కి రాదు. సమస్య పెద్దదై ఇండస్ట్రీ స్దంభించే సిట్యువేషన్. ఎవరికీ ఏం చేయాలో తెలియటం లేదు...డబ్బున్న వాళ్లకు ఏ ఇబ్బంది లేదు...రోజు వారి సంపాదించుకునే సినిమావాళ్లుకు ఏం చేయాలో అర్దం కావటం లేదు. అలాంటి సమయంలో ఓ ఇండస్ట్రీ పెద్దగా..ఇరు వర్గాలను పిలిచి, కూర్చో పెట్టి మాట్లాడి సెటిల్ చేసే వ్యక్తి అవసరం ఉంది. ఎవరూ ధైర్యం చేయటం లేదు. అప్పుడు అందరి దృష్టీ దాసరిగారి మీదే. ఆయన్ను కలవటం. ఆ రోజు సాయింత్రమే మీటింగ్...క్షణాల్లో పరిష్కారం. ఆయన చేతిలో ఏ మ్యాజిక్ దండం ఉందో, ఆయన మాటల్లో ఏం ఉందో కానీ అంతా సెటిల్ అయ్యిపోయింది. అంతా హ్యాపీ. నో కంప్లైంట్స్..అలాంటప్పుడు అందరూ చేతులెత్తి మ్రొక్కారు. మళ్లీ అలాంటి సమస్యలు వస్తే ఇప్పుడు పరిష్కరించే వాళ్ళు ఎవరు... గాఢ్ పాధర్...గాడ్ దగ్గరకి వెళ్లిపోతే...ఇక్కడ ఆ ప్లేస్ ని ఎవరైనా,ఎప్పటికైనా భర్తి చేయగలరా అనిపిస్తుంది.

ఎందుకంటే...ఎంత గొప్పవాడికైనా..ఓ పది సంవత్సరాలు..ఓ ఇరవై సంవత్సరాలు...లేదా ముప్పై సంవత్సరాలు ప్రభ వెలుగుతుంది. కానీ దాసరి గారి వీటికి అతీతుడు. ఆయన ఉన్నంతకాలం తెలుగు పరిశ్రమకు ఆయనే పెద్ద దిక్కు. చాలా విషయాల్లో దిశా, నిర్దేశం చేసే సమర్దుడు. అలాంటి ఆయన హఠాత్తుగా ఇలా దిక్కులేని వాళ్లలా పరిశ్రమను వదిలేసి వెళ్లిపోతారని ఎవరు ఊహిస్తారు.

దాసరికన్నా గొప్పసినిమాలు తీయచ్చు... గొప్ప కథలు, డైలాగులు రాసేవాళ్లు ఉండచ్చు..ఆయనలాగ పాటలు రాసేవాళ్లు చాలా మంది ఉండవచ్చు.కానీ ఆయనలాగ తీసే వాళ్ళు అయితే ఉండరని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పొరపాటున..తరాలు గడిచి...ఆయన సినిమాలు మర్చిపోవచ్చేమే కానీ ఆయన్ని మరవటం అసాధ్యం. సినిమా అంటే కేవలం స్టార్సే కాదు...క్రియేటివిటి ఉన్న డైరక్టర్స్ కూడా అంటూ...దర్శకుడు అనే పదానికి గుర్తింపు తెచ్చిన ఆయన్ని దర్శకులు ఎప్పుడూ గుర్తే పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటారు కూడా.

ఆయన జీవితాన్ని పరిశీలిస్తే... చాలా భాగం జీవితాన్ని, సినిమాని వేరుగా చూడలేదు అని అర్దమవుతుంది. అంతలా ఆయన పరిశ్రమతో మమేకం అయ్యారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా... ఆలోచింపచేసే సినిమాలూ అవసరమే అని తీసి గెలిచారు. ముఖ్యంగా ...మధ్యతరగతి జీవితపు మందహాసాలు వెనుక ఉన్న ఆర్దతలోని తడిని తన సినిమా ద్వారా అందించిన ...దాసరి అదేసమంయలో స్టార్స్ తో సినిమా తీసి పెద్ద హిట్స్ ఇచ్చారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టడం కష్టం అంటారు కానీ ఆయన అటు కమర్షియల్, ఇటు ఆర్ట్ అనే భేధం లేకుండా అలవోకగా తన సృజనా వ్యవసాయం చేసి, ఎన్నో సినిమా ఫలాలను అందించారు.

ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. ‘మనుషులంతా ఒక్కటే’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘సర్కస్‌ రాముడు’, ‘విశ్వరూపం’, ‘బొబ్బిలి పులి’ వంటి చిత్రాలను దాస‌రి ఆయనతో తీశారు. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాల్ని సినిమాలతో ఎలుగెత్తి చాటుతూ.. అనేక సందేశాత్మక చిత్రాలను తీసి తెలుగు చలన చిత్ర పరిశ్రమను దాసరి గిన్నీస్‌రికార్డుకు ఎక్కించారు. రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న దాసరి... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచుకున్నారు. తాండ్ర పాపరాయుడు, సూరిగాడు వంటి చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా..."కంటే కూతుర్నే కను" చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. అలాగే 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు. చికాగో, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో మేఘసందేశం చిత్ర ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇవన్నీ మామూలు విషయాలా చెప్పండి.

ఇక దాస‌రి ప‌త్రికా రంగంలో కూడా సంచలనం సృష్టించారు. 1984లో ఉద‌యం ప‌త్రిక‌ను స్థాపించి చీఫ్ ఎడిట‌ర్‌గా చేసారు. అప్ప‌ట్లో ప‌త్రికా రంగంలో ఉద‌యం సంచ‌ల‌నం సృష్టించింది. దాదాపు 11 సంవ‌త్స‌రాలు ఉద‌యం ప‌త్రిక దిగ్విజ‌యంగా కొన‌సాగిన ఈ పత్రికలో పతంజలి గారు రాసిన నవలలు ఎవరు మర్చిపోగలరు చెప్పండి. ఉదయం కోసం ఉదయమే ఎదురుచూసేవాళ్లం అని గర్వంగా చెప్పుకునే చాలా మంది అభిమానులను తయారు చేసిన సమర్దత ఆయనది.

నిజానికి ప్రతీ రోజుకు ఎందరో ఈ భూమ్మీదకు వస్తారు..వెళ్లిపోతారు..ఎందుకు వాళ్లందరి గురించి మాట్లాడుకోం..కేవలం సినిమా మనిషనా ఆ ప్రత్యేకత..సెలబ్రెటీ అనా ఈ వీడ్కోలు మాటలు..మౌన ప్రసంగాలు. అయినా సినిమా వాళ్లు కూడా చాలా మంది మనకు చెప్పకుండానే , పరలోకాలకి ప్రయాణం కడతూంటారే.వారి గురించి ఓ ఫొటో పెట్టి, రిప్ అని కూడా అనం...ఎక్కడుంది తేడా...ఏముంది దాసరిలో గొప్పతనం అంటే...ఇది ఖచ్చితంగా పిచ్చి ప్రశ్నే అవుతుంది. దాసరిలో ఏ విషయంలో లేదు ప్రత్యేకత అని అడగాల్సింత బహుముఖ ప్రజ్ఞాశాలి అవటం వల్ల ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన్ని ఈ రోజున స్మరించుకోవాలంటే...కేవలం సినిమా వాడుగానే కాదు. ...ఉదయం పత్రికను సమర్దవంతంగా నడిపిన మీడియావాడుగానే కాదు...కేంద్ర మంత్రిగా చేసిన ఓ రాజకీయ నాయుకుడుగానే కాదు... అంతకు మించి ఓ మంచి మనిషిగా, సామాజిక చింతన గలిగిన దార్శినికుడుగా నిరంతరం తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలేఉంటుంది దాసరి గారి గురించి. ముగిసిన ఆయన శకానికి మనమూ సాక్షులను చేసినందుకు దేవుడుకి ధన్యవాదాలు చెప్దాం, సమకాలీకులమైనందుకు గర్విద్దాం. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుందాం.. అంతకు మించి ఏం మాట్లాడగలం ఈ విషాదసమయంలో....

-Ragalahari Team

ADVERTISEMENT
ADVERTISEMENT